ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్రం బిచ్చగాళ్లలా చూస్తోందని.. నటుడు శివాజీ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షాల పట్ల దేశ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, కర్ణాటకలో బీజేపీ గెలిచినా బాధపడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెప్తారని శివాజీ తెలిపారు.
రాష్ట్రంలోని కొన్ని పార్టీలు బీజేపీతో లోపాయికారిగా పనిచేస్తున్నాయని.. వైసీపీ, జనసేనలను ఉద్దేశించి శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు హోదా కోసం పోరాడుతున్నట్టు నటిస్తున్నాయన్నారు. ఏపీకి హోదా, విభజన హామీలు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఏదో నామమాత్రానికి ఉద్యమాలు చేస్తున్నాయని.. నిర్ణయాత్మక ఉద్యమాలు చేయట్లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా, ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ లేకుండా కాంగ్రెస్ ఇచ్చిందని, మేం న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ కూడా కొంపముంచిందని శివాజీ చెప్పారు.