డిజైనింగ్ - రీటెండరింగ్ పేరుతో ప్రజాధనం కొల్లగొట్టేస్తున్న సీఎంలు : శివాజీ

గురువారం, 3 అక్టోబరు 2019 (11:40 IST)
మెఘా అధినేత కృష్ణారెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సినీ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. డిజైనింగ్, రీటెండరింగ్ పేరుతో ప్రజాధనం దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణారెడ్డి మిత్రద్రోహి అంటూ మండిపడ్డారు. ఆయన అక్రమాలకు సంబంధించిన నిజాలను ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. 
 
ఈ విషయాలను మీడియా ద్వారా బయటపెడదామని తాను అనుకున్నానని... అయితే వాటిని ప్రసారం చేసే దమ్ము దేశంలోని ఏ మీడియాకు లేదని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుని, వాటిని ముఖ్యమంత్రులతో పంచుకోవడం దేశద్రోహమని అన్నారు. 
 
ముఖ్యంగా, ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీటెండరింగ్ పేరుతో సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దారుణమని చెప్పారు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో బస్సులను కొని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జేబుల్లోకి వేసుకోవడం అతి పెద్ద నేరమని అన్నారు.
 
ఓఎన్జీసీలో 27 రిగ్గుల కాంట్రాక్టును దక్కించుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసిన దేశద్రోహి గురించి చెప్పాలనుకుంటున్నానని... దేశానికి ముప్పుగా పరిణమించిన ఆ ద్రోహి మేఘా కృష్ణారెడ్డి అని శివాజీ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు