మనపని అయిపోయింది పక్కకు పోదామన్న జ్ఞానం కూడా లేదు : ఆళ్ళ రామకృష్ణారెడ్డి

గురువారం, 18 జులై 2019 (16:53 IST)
టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మరోమారు మాటల తూటాలు పేల్చారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా టీడీపీ నేతలకు బుద్ధిరావడం లేదన్నారు. పైగా, మన పని అయిపోయింది పక్కకు పోదామన్న జ్ఞానం కూడా లేదంటూ మండిపడ్డారు. 
 
ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ, కృష్ణానది కరకట్టపై ఉన్న భవనాల కూల్చివేతకు ఇప్పటికే 70 భవనాలకు నోటీసులు ఇచ్చారనీ, అయినా ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. పైగా, కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వ భవనం అని 2016 మార్చి ఆరో తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని ఆర్కే గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలు ఓడించినా కూడా తెలుసుకోలేక పోతున్నారన్నారు. 'మన పని అయిపోయింది. పక్కకు వెళ్లిపోదాం' అనే జ్ఞానం కూడా లేకుండా ఇంకా నేను ఇక్కడే ఉంటా. నన్ను ఎవరు కదిలిస్తారు.. అంటూ కనీసం మనిషికున్న విలువ, విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కరకట్టపై ఉన్న భవన యజమానులు తమ గృహాలను ఖాళీ చేయాలని కోరారు. 
 
ఇక ప్రజావేదిక గురించి ఆర్కే మాట్లాడుతూ, నాలుగు రేకులు, రెండు ఇటుకలు, ఓ గోడ ఇదే ప్రజావేదిక అని చెప్పారు. 'రూ.2 కోట్ల అంచనా పనులు. అదీ నామినేషన్ పద్ధతి కింద అప్పగించారు. చివరికి అంచనాలు రూ.10 కోట్లకు చేరాయి. తీరా చూస్తే నాలుగు రేకులు, రెండు ఇటుకలు, ఓ గోడ.. అంతకుమించి ఏమీ లేదు అధ్యక్షా. అలాంటి అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం కూలిస్తే దాన్ని హర్షించాల్సిందిపోయి ఈ విధంగా చేయడం ఎంతమాత్రం సరికాదు' అంటూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు