పీపీఏల వ్యవహారంలో... సర్కారు దూకుడుకు హైకోర్టు కళ్లెం

శుక్రవారం, 26 జులై 2019 (08:46 IST)
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) సర్కారు దూకుడుకు హైకోర్టు కళ్లెం వేసింది. పవన, సౌర విద్యుదుత్పత్తి కొనుగోలు ఒప్పందాలపై సమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ (హెచ్‌ఎల్‌సీ)ని నియమిస్తూ జారీ చేసిన జీవో 63ను నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ఈ నెల 12న దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (సదరన్‌ డిస్కమ్‌) వివిధ విద్యుదుత్పత్తి సంస్థలకు రాసిన లేఖ అమలును కూడా నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది.

గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు ఈ ఆదేశాలు జారీ చేశారు. పీపీఏలపై ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ సుమారు 40 ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది.

పీపీఏల సమీక్ష వ్యవహారంలో హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమేముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘పీపీఏలపై సమీక్ష ప్రభుత్వ విధి కాదు. అది విద్యుత్‌ నియంత్రణ మండలి (ఆర్‌సీ) బాధ్యత! విద్యుదుత్పత్తి సంస్థలను ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకింత తొందరపాటు? ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం ఉన్నతస్థాయి కమిటీకి లేదు. హడావుడి నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. ఈఆర్‌సీలాంటి సంస్థల్ని వేదికగా చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, లేదా సామరస్యపూర్వకంగా ఇతర మార్గాలు అన్వేషించండి’’ అని న్యాయమూర్తి సూచించారు.
 
సమీక్షకు వీల్లేదు: పిటిషనర్లు
పిటిషనర్ల తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ, సీనియర్‌ న్యాయవాదులు వికా్‌ససింగ్‌, సి.మోహన్‌రెడ్డి, డి.ప్రకాశ్‌ రెడ్డి, వేదుల వెంకటరమణ, శ్రీరఘురాం, చల్లా గుణరంజన్‌ తదితరులు వాదనలు వినిపించారు. అన్ని సంప్రదింపుల తర్వాతే 2015లో ఒప్పందాలు జరిగాయని, ఇప్పుడు సంప్రదింపులకు తావెక్కడుందని వీరు ప్రశ్నించారు. ‘‘పీపీఏల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హద్దులు అతిక్రమించి వ్యవహరిస్తోంది. 2015లో విద్యుదుత్పత్తి సంస్థలు, ఏపీ ప్రభుత్వం మధ్య చట్టబద్ధమైన ఒప్పందం కుదిరింది. ఒప్పందం జరిగినప్పుడు గుజరాత్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలకన్నా తక్కువ ధరకే టారిఫ్‌ నిర్ణయించారు.
 
ఇప్పుడు కొత్తగా ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేసి టారీఫ్ పై సమీక్షలకు రావాలని చెబుతోంది. అలా రాకుంటే ఒప్పందాన్ని రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ ధరను రూ.2.44కు తగ్గించాలని, ఆ మేరకు బిల్లులు సమర్పించాలని సదరన్‌ డిస్కమ్‌ బెదిరింపు ధోరణిలో షోకాజ్‌ నోటీసులు పంపింది. ప్రాజెక్టు ప్రారంభం నుంచే తగ్గింపు ధరలతో బిల్లులు ఇవ్వాలనడం మరీ అక్రమం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి విచారణాధికార పరిధిగానీ, అధికారాలు గానీ లేవు. అలాంటప్పుడు ఆ కమిటీని సంప్రదించాల్సిన అవసరమేంటి?’’ అని న్యాయవాదులు ప్రశ్నించారు.
 
రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, దీనిపై రాష్ట్రానికి లేఖ కూడా రాసిందని గుర్తు చేశారు. ‘‘ధరలు సమీక్షించవచ్చు. కానీ, అది చట్టబద్ధంగా ఉండాలి. టారిఫ్‌ నిర్ణయించే అధికారం ఈఆర్‌సీకి మాత్రమే ఉంది. దానిపై అభ్యంతరాలు లేవనెత్తింది రాష్ట్ర ప్రభుత్వం కనుక, అవసరమనుకుంటే వారే ఈఆర్‌సీకి వెళ్లాలి. అక్కడ మా వాదనలు వినిపిస్తాం. ఈఆర్‌సీకి రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు వర్తించవు’’ అని తెలిపారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తేల్చి చెప్పారు. సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను, డిస్కమ్‌ రాసిన లేఖ అమలును రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.
 
చట్టానికి లోబడే చర్యలు: అడ్వకేట్‌ జనరల్‌
విద్యుత్‌ ధరల విషయంలో చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ‘‘డిస్కంలు ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో రోజుకు రూ.7కోట్ల నష్టం వాటిల్లుతోంది. ధరలపై షోకాజ్‌ నోటీసు మాత్రమే ఇచ్చాం. ఇది కేవలం ప్రాథమిక దశ మాత్రమే. ఆ మాత్రానికే ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయబోం. ఆ నోటీసు ఆధారంగానే ధరల నియంత్రణపై నిర్ణయం తీసుకోబోం. ప్రభుత్వం చట్టప్రకారమే చర్యలు తీసుకుంటుంది. పిటిషనర్లు అవగాహనాలోపంతో కోర్టును ఆశ్రయించారు. సంస్థలకు ఏవైనా అభ్యంతరాలుంటే ఈఆర్‌సీని ఆశ్రయించవచ్చు. విద్యుత్‌ ఒప్పందాలను పరిశీలించి తగిన సిఫారసులు చేయడం కోసమే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో మాకెలాంటి తొందరపాటు లేదు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు కొంత గడువు ఇవ్వండి’’ అని ఏజీ కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు