పోలీసుల రంగ ప్రవేశంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కాగా, బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
ఇదిలా ఉంటే, చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది.
ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు.