హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన బాల‌య్య‌

మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:16 IST)
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం ప్ర‌భుత్వాసుప‌త్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పనితీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆస్పత్రిలో సమస్యలు నెలకొన్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. గతంలో ఎక్కువగా ఉండే ఓపీ... నేడు చాలా తక్కువ సంఖ్యకు పరిమితమైందని అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలో వెళ్లిపోయిందని ఆక్షేపించారు. వైకాపాకు సొంత ఖజానా నింపుకోవాలనే ఆరాటమే త‌ప్ప  అభివృద్ధి పట్టడం లేద‌ని విమ‌ర్శించారు. 
 
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేద‌ని, ఈ అంశంపై రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయ‌ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉంటే, ఇతర ఆస్పత్రులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చ‌న్నారు. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని నందమూరి బాలకృష్ణ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు