పెళ్లైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య..

ఆదివారం, 10 అక్టోబరు 2021 (11:45 IST)
భర్త వేధింపులు భరించలేకపోయిన నూతన వధువు.. పెళ్లైన నెల రోజులకే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివసిస్తున్న వెంకటేశులు, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె పల్లవి (28) ఉన్నత విద్యనభ్యసించింది. ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన పల్లవి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
 
ఈ క్రమంలో పల్లవిని కుటుంబ సభ్యులు.. ఆగస్టు 27న పామిడికి చెందిన ప్రైవేటు టీచర్ మలికార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే.. పెళ్లి అయిన కొన్ని రోజులకే.. ఇచ్చిన కట్నకానుకలు చాలవని, అదనపు కట్నం తీసుకురావాలంటూ పల్లవిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త వేధింపులను తట్టుకోలేకపోయిన పల్లవి నెల రోజులకే పుట్టింటికి వెళ్లింది. 
 
పది రోజులుగా పుట్టింట్లో ఉన్న పల్లవిని.. భర్త తరచూ ఆమెకు ఫోన్‌ చేసి మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పల్లవి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు