పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటూ తిరుపతిలో ఓ మహిళ, పోలీస్టేషన్ ఎదుట రోడ్డుపై కన్నబిడ్డతో సహా కూర్చుని న్యాయం కోసం పోరాటం చేసింది. మండుటెండలో గాంధీ విగ్రహం ముందు కూర్చుని న్యాయం కావాలంటూ బోరున విలపించింది. కానీ భర్త మాత్రం వేరొక మహిళను మోటారు బండిపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తిరుపతిలో నివాసముంటున్న వెంకటాచలం, సరస్వతిలు 13 యేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక వెంకటాచలం మరో మహిళకు దగ్గరయ్యాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. భర్త ప్రవర్తనతో విసుగుచెందిన మహిళ ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది.
కానీ పోలీసులు ఉదయం నుంచి ఫిర్యాదు తీసుకోకుండా కాలయాపన చేయడంతో మహిళ ఆవేదనతో రోడ్డుపై నిరసనకు కూర్చుంది. ఆమె భర్త కూడా రెండో భార్యను తీసుకుని స్టేషన్‌కు రావడంతో ఆగ్రహించిన మహిళ సరస్వతి అతనితో గొడవకు దిగింది. దీంతో ఆమె భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. నడిరోడ్డుపై మహిళ న్యాయం కోసం పోలీస్టేషన్ ఎదుట బైఠాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యాయం కావాలంటూ మహిళ, ఎస్పీని ఆశ్రయించింది.