మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు... ఇంటర్నెట్‌లో షేర్ చేస్తామని బెదిరింపులు.. రూ.2.50 కోట్లు స్వాహా...

ఠాగూర్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (09:42 IST)
మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ ఓ యువతిని బెదిరించి కిలేడీ దంపతులు.. బాధితురాలి నుంచి రూ.2.50 కోట్ల మేరకు దోచుకున్నారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు.. ఈస్ట్ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీగా పని చేస్తున్నారు. హాస్టల్‌లో ఆమెకు గుంటూరుకు చెందిన కాజ అనూషాదేవి పరిచయమైంది. కొన్నాళ్లకు అనూషకు సాయికుమార్ వివాహమైంది. ఆ తర్వాత కూడా వారి మధ్య స్నేహం కొనసాగింది.
 
అయితే, స్నేహితురాలి నుంచి డబ్బులు దోచుకోవాలని అనూష, ఆమె భర్త సాయికుమార్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరింపులకు దిగారు. దీంతో భయపడిపోయిన యువతి తన వద్దనున్న డబ్బుతోపాటు బంధువుల ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.2,53,76,000 నగదును వారికి బదిలీ చేసింది.
 
అయినప్పటికీ వారి వేధింపులు ఆగకపోవడంతో మూడు రోజుల క్రితం నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడు సాయికుమార్‌ను గుంటూరులో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1,81,45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడి స్థిర, చరాస్తులను సీజ్ చేశారు. అతడి భార్య, నిందితురాలు అనూషాదేవి మాత్రం పోలీసులకు చిక్కకుండా పారిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు