ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా...అందుకే సూసైడ్ చేసుకుంటున్నా

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:18 IST)
పాతబస్తీ సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్ తన భార్య ఆమె తల్లిదండ్రులతో వేధిస్తోందని సెప్టెంబర్ 19 అర్థరాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరణించాడు.


అయితే తన ఆత్మహత్యకు గల కారణాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఆ 37 నిమిషాల వీడియోలో తను, తన తల్లిదండ్రులు పడిన మనోవేదనను వివరిస్తూ తన చావుకు కారణం శ్రీహర్ష అలియాస్ సిరి, ఆమె తల్లిదండ్రులు మరియు అత్త చంద్రకళ అని చిట్టిపాక శ్రీకాంత్ ఆరోపించాడు.
 
'సిరి (శ్రీహర్ష), నేను ఒకే స్కూల్. ఐదో తరగతి నుంచే మాకు పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంటర్‌లో తనే మొదటగా నాకు ప్రపోజ్ చేసింది. నేను ఇంజనీరింగ్‌కి వచ్చాక పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత ఆమెను ఎంతో అపురూపంగా చూసుకున్నా, ఎన్నో త్యాగాలు చేశా. అంతేకాదు తన కోసం మతం కూడా మార్చుకున్నా.. ప్రతి ఆదివారం ఆమెతో కలిసి చర్చికి వెళ్లేవాడిని, భగవద్గీత కూడా చదవని నేను ఆమె కోసం బైబిల్ చదివా. ఇంట్లో వాళ్లు కూడా సిరిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కట్టుబట్టలతో నా ఇంటికి వచ్చింది.. ఆమె కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు కట్టడానికి అప్పులు కూడా చేసాను.. తాహతుకి మించి ఖర్చుపెట్టి మరీ తనను సంతోషపెట్టాము' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. 
 
ఉదయం 11, 12 గంటల వరకు కూడా నిద్ర లేచేది కాదు, పనులన్నీ తన తల్లిదండ్రులే చేసేవారని చెప్పాడు. ఇక ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా బాగా చూసుకున్నారని, తన తల్లి కాలు విరిగి మంచాన పడ్డా కూడా సిరి కోసం మంచం వద్దకే స్టౌ తెప్పించుకొని ఆమెకు ఇష్టమైన చిరుతిళ్లు చేసి పెట్టిందని తెలిపాడు. అటువంటి తనను, తన కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టిందని బాధపడ్డాడు.
 
శ్రీహర్ష తండ్రి షణ్ముఖాచారి పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని, నకిరేకల్‌లో ఆయనకు చాలా పలుకుబడి ఉంది, మేము పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడని, ఇక ఆమె తల్లి ఆమెతో మాటలు తరచుగా కలిసి తమ వైపుకు తిప్పుకుందని చెప్పాడు. అంతేకాకుండా సిరికి ఏడో నెలలో ప్రమాదం అని తెలిసినా అబార్షన్ చేయించారని, దానికి సిరి కూడా ఒప్పుకుందని వాపోయాడు. సమాజంలో మగవాళ్లు చేసే తప్పులే కనిపిస్తాయి, ఆడవాళ్ల తప్పులను పట్టించుకోరు. సిరి నన్ను అన్ని విధాలా వాడుకొని, తన తల్లిదండ్రుల మాటలు విని దారుణంగా మోసం చేయడంతో పాటు నాపై, నా తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేసిందని వాపోయాడు శ్రీకాంత్. 
 
నన్ను వేధిస్తే ఊరుకున్నాను, కానీ నేను చెసిన తప్పు వలన నా తల్లిదండ్రులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిని చూస్తే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా సమాజం నమ్మడం లేదు. అందుకే నాకు నేను శిక్ష విధించుకుంటున్నా’ అని శ్రీకాంత్ చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు