వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి వుందని చెప్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన నేపథ్యంలో.. కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకే జగన్ ఇలాంటి పాదయాత్రల సాకు చెప్తున్నట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మినహాయింపును కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం నాడు రాలేకపోతే, అందుకు కారణాలను వెల్లడిస్తూ, కింది కోర్టులోనే అనుమతి పొందవచ్చని.. అది ఆ కోర్టు విచక్షణపైనే ఆధారపడి వుంటుందని హైకోర్టు తేల్చి చెప్పేసింది. నాలుగేళ్ల తర్వాత పాదయాత్ర అనే కారణంతో పిటిషన్ సమర్పించడం వెనుక కోర్టుకు హాజరు కాకూడదనే ఆలోచన వుందేమోనని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.