'నన్ను పరీక్ష రాయనివ్వలేదు సారీ మమ్' ... విద్యార్థిని సూసైడ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:52 IST)
హైదరాబాద్ నగరంలో మరో చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఫీజు చెల్లించనిదే పరీక్ష రాయనివ్వమంటూ స్కూల్‌ యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపించడంతో మనస్తాపం చెందిన బాలిక ఈ దారుణానికి పాల్పడింది. స్కూలు నుంచి ఇంటికొచ్చిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఉరేసుకుంది. 
 
ఈ చర్యకు పాల్పడేముందా ఆ చిన్నారి ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టింది. అందులో 'నన్ను పరీక్ష రాయనివ్వలేదు సారీ మమ్‌' అంటూ పేర్కొంది. ఈ విషాద ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలోని జయగిరి లక్ష్మీనర్సింహస్వా మినగర్‌లో గురువారం సాయంత్రం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, మల్కాజిగిరి జేఎల్‌ఎస్‌నగర్‌లో నివాసముండే బాలకృష్ణ, సునీత అనే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు సాయిలత బీటెక్‌ చదువుతుండగా రెండో అమ్మాయి సాయిదీప్తి (14) మల్కాజిగిరి జ్యోతి నగర్‌లోని జ్యోతి హైస్కూల్లో తొమ్మిదోతరగతి చదువుతోంది. కాగా సాయిదీప్తి స్కూలు ఫీజు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంది. ఈనెల మొదటివారంలో చెల్లిస్తామని తండ్రి బుధవారమే స్కూల్‌కెళ్లి నిర్వాహకులకు చెప్పివచ్చాడు. 
 
అయితే గురువారం స్కూల్లో యూనిట్‌ పరీక్షలు నడుస్తున్నాయి. అయితే, ఫీజు చెల్లించలేదని యాజమాన్యం ఆమెను ఇంటికి పంపించేసింది. దీంతో గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికొచ్చిన సాయిదీప్తి ప్యాన్‌కు ఉరేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు