హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉన్న రాజధాని బంధం తెగిపోయింది. ఏపీ విభజన చట్టం మేరకు హైదరాబాద్ నగరం ఏపీకి, తెలంగాణకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈ గడువు జూన్ ఒకటో తేదీతో ముగిసిపోయింది. దీంతో హైదరాబాద్ ఇక తెలంగాణాకు శాశ్వత రాజధానిగా మారింది. అదేసమయంలో ఏపీలోని అధికార వైకాపా పాలకులు అనుసరించిన నిరంకుశ పాలన కారణంగా దేశంలో ఎలాంటి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటలకెక్కింది.
విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇపుడు ఈ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు విభజిత తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ నుంచి పాలన అందించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశారు.