ట్రైనీలో ఉండగానే పిచ్చి వేషాలు... యువ ఐపీఎస్ అధికారిపై అట్రాసిటీ కేసు

బుధవారం, 30 అక్టోబరు 2019 (09:01 IST)
శిక్షణలో ఉండగానే ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారి పిచ్చి వేషాలు వేశాడు. ఫలితంగా ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్‌లో ఇది చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తొమ్మిదేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో కడపకు చెందిన వెంకటమహేశ్వర్ రెడ్డితో భావన అనే యువతికి పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో 2018 ఫిబ్రవరిలో తాము వివాహం చేసుకున్నారు. 
 
అనంతరం వెంకటమహేశ్వర్ రెడ్డి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడని, తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పడంతో వారిద్దరు కలిసే ఉంటున్నారన్నారు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. పైగా, అదనపు కట్నంకోసం డిమాండ్ చేయసాగాడు. అంతేకాకుండా, ఎక్కువ కట్నం ఇచ్చి తనకు పిల్లనివ్వడానికి వస్తున్నారని, అడ్డొస్తే ఊరుకోననీ బెదిరించాడు. అలాగే, గత కొన్ని రోజులుగా ఆమెను దూరంగా ఉంచాడు. 
 
దీంతో తాను మోసపోయానని గ్రహించిన భావన... జవహర్ నగర్ పోలీసులకు సదరు ట్రైనీ ఐపీఎస్ అధికారిపై ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆ యువ ఐపీఎస్ అధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మూడు నెలల క్రితం కూడా భావన ఇదేరీతిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ (వెంకటమహేశ్వర్ రెడ్డి, భావన) పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. 
 
అయినప్పటికీ మార్పు రాకపోవడంతో ఈ తరహా కేసును నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం మహేశ్వర రెడ్డి ముస్సోరిలో ఐపీఎస్ శిక్షణలో ఉండటంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు