స్పీకర్ తమ్మినేని వాదనతో ఏకీభవిస్తున్నా: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సంచలన ప్రకటన

శుక్రవారం, 3 జులై 2020 (16:50 IST)
న్యాయస్థానాలు వాటి బాథ్యత నిర్వర్తించకుండా, ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నాయి, న్యాయమూర్తులే పాలన చేయొచ్చు కదా, ఎన్నికలు ఎందుకు, దీనిపై మేథావులు, న్యాయమూర్తులు చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యానించారని, ఆయన చెప్పిన దానిలో 'చర్చించాలి' అన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నానని టీడీపీనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని, కోర్టులు పలుమార్లు తప్పపట్టాయని, ప్రభుత్వం అసలు అటువంటి అహంకారపూరిత పనులు ఎందుకు చేస్తుందో ఆలోచించాల్సిన బాధ్యత తమ్మినేనిపై లేదా అని కనకమేడల ప్రశ్నించారు.

తమ్మినేని ఏహోదాలో న్యాయస్థానాలను తప్పుపట్టారో స్పషం చేయాలన్నారు. స్పీకర్ గా మాట్లాడారా, లేక వైసీపీ సభ్యుడిగానా, లేక సామాన్య పౌరుడిగానా అని నిలదీశారు. తమ్మినేని జరగాలంటున్న చర్చ నిష్పక్షపాతంగా, వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు తావులేకుండా, రాజ్యాంగానికి లోబడి జరగాలని రవీంద్రకుమార్ సూచించారు.

చర్చకు టీడీపీ సిద్ధమేనని, రాజ్యాంగం పరిధిఏమిటి? న్యాయస్థానాలు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పరిధిఏమిటనే దానిపై చర్చ జరగాలన్నారు. రాజ్యాంగంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని, వాటిలో ప్రధానమైనవి ఆర్టికల్-14, ఆర్టికల్ -19, 21ఏ, లపై కూడా చర్చ జరగాలన్నారు.

రాజ్యాంగంలోని చాప్టర్-1 మరియు 2లో, అర్టికల్ 52 నుంచి 78 వరకు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గురించి, ఆర్టికల్ 79 నుంచి 122 వరకు పార్లమెంట్ పరిధిని గురించి, యూనియన్ జ్యూడీషీయరీ గురించి ఆర్టికల్ 124 నుంచి 147 వరకు వాటియొక్క పరిధులు, విధులను స్పష్టం చేసిందని కనకమేడల పేర్కొన్నారు.

రాష్ట్రాల విషయానికి వస్తే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గురించి ఆర్టికల్153 నుంచి 162లో, స్టేట్ లెజిస్లేచర్ గురించి ఆర్టికల్ 162 నుంచి 212లో, హైకోర్టుని గురించి ఆర్టికల్ 214 నుంచి 232 వరకు నిర్ధేశించడం జరిగింది. ఏఏ వ్యవస్థల విధులు, పరిధులేమిటో, రాజ్యాంగం నిర్దేశించిన ఆర్టికల్స్ ప్రకారం చర్చించాలన్నారు.

తమ్మినేని శాససభ్యుడిగా మాట్లాడినా, స్పీకర్ గా మాట్లాడినా ఆయనకు అలా మాట్లాడే హక్కు, అధికారం లేవని రవీంద్రకుమార్ తేల్చిచెప్పారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదు అంటున్న తమ్మినేని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఎన్నికైన ప్రభుత్వమైనా, న్యాయస్థానాలైనా, ముఖ్యమంత్రులైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలన్న సత్యాన్ని గుర్తించాలన్నారు.

ఎవరైనా సరే రాజ్యాంగం నిర్దేశించిన విధుల ప్రకారమే నడుచుకోవాలన్నారు. ఆర్.ఆర్.కపూర్ – జయలలిత కేసులో5గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం చాలాస్పష్టంగా ఎన్నికైన ప్రభుత్వాల పరిధేమి టో, కోర్టుల పరిధేమిటో, ఎవరుఎలా నడుచుకోవాలో స్పష్టంగా పేర్కొన్నదని, ఆనాటి తీర్పుని తమ్మినేని ఒక్కసారి చదువుకుంటే మంచిదని కనకమేడల సూచించారు.

మెజారిటీ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యంగ పరిధికి లోబడి ఉంటేనే అవి చెల్లుతాయని కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కోర్టులను పదేపదే తప్పుపట్టే వారందరికీ ఆనాటి ఆ తీర్పు చెంపపెట్టువంటిదన్నారు. ఎంతటి గొప్పవ్యక్తులైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలే తప్ప, రాజ్యాంగంపై ఎక్కి కూర్చోకూడదు అని కూడా మరో కేసులో స్పష్టంచేయడం జరిగిందని కనకమేడల చెప్పారు.

రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించాల్సిన వారు, వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే, వారిని కట్టడిచేసే అధికారం కోర్టులకు ఉందని కూడా చెప్పడం జరిగిందన్నారు. రాజ్యాంగమే సుప్రీం అని కూడా సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. 
జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నంద్యాల ఎన్నికల ప్రచారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి చంద్రబాబుని నడిరోడ్డుపై నిలుచోబెట్టి కాల్చేయండి అన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు ఏ కోవలోకి వస్తాయో తమ్మినేని చెప్పాలన్నారు.

ప్రభుత్వం తాను చేసే చెడు పనులకు చంద్రబాబునాయుడిని, ఆయన పార్టీని వాడుకుంటోందని, ప్రజలు ఆయన్ని కాదని తమను ఎన్నుకున్నారన్న విషయాన్ని ప్రభుత్వపెద్దలు ఎందుకు గ్రహించడంలేదని కనకమేడల నిలదీశారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే, దాన్నెందుకు ఈ ప్రభుత్వం కొనసాగించడంలేదన్నారు.

చంద్రబాబు కట్టిన భవనాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వం, వాటిలో ఉండే ఎందుకు పాలన సాగిస్తోందన్నారు? ప్రభుత్వం రాజ్యాంగవిరుద్దమైన నిర్ణయాలు తీసుకోబట్టే, కోర్టులు 69 సార్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టాయన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అమలుచేయక పోబట్టే, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులచుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు బలైన 11మంది అధికారులు నేటీకీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని కనకమేడల గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ప్రతిదానిపై విచారణ జరుపుతామని, సీబీఐ-సీఐడీ తో నిజాలు నిగ్గుతేలుస్తామని మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, జగన్ అవినీతికేసుల విచారణ సీబీఐ వద్ద ఎందుకు నిలిచిపోయిందో సమాధానం చెప్పాలని రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.

సీబీఐద్వారా రూ.43వేలకోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని నిర్ధారింపబడిన తరువాత జగన్మోహన్ రెడ్డి ముద్దాయేనని, ఆయనపై ఉన్న కేసుల విచారణను ఎవరు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం సాధిస్తున్న కక్షసాధింపులు రాజ్యాంగపరిధిలో లేవన్న కనకమేడల, అచ్చెన్నాయుడు 150 కోట్ల అవినీతి చేశాడని ఆరోపించిన ప్రభుత్వం, చివరకు రూ.3కోట్లకే దాన్ని పరిమితం చేసిందని, మంత్రిహోదాలో ఆయనరాసిన లేఖను సాక్ష్యంగా చూపుతోందన్నారు.

కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండగానే, ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని బలవంతంగా డిశ్చార్జి చేసి, జైలుకు పంపడం కక్ష
సాధించడంకాక మరేమిటో చెప్పాలన్నారు. అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టినప్రభుత్వం, రాజధాని మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి, వారిపైజులుం ప్రదర్శించిన పోలీసులపై ఏం చర్యలు తీసుకుందన్నారు. ఇటువంటివేవీ స్పీకర్ కు కనిపించడంలేదా అని రవీంద్రకుమార్ ప్రశ్నించారు.

రాష్ట్ర ఎన్నికలకమిషనర్ గా ఉన్న వ్యక్తిని దొడ్డిదారిన తొలగించడం ఎలాంటి చర్యో చెప్పాలన్నారు. ఏకగ్రీవాలు జరిగినంతకాలం మంచివాడిగా ఉన్న వ్యక్తి, ఎన్నికలు వాయిదావేయగానే చెడ్డవాడిగా ఎలా మారాడన్నారు. ప్రభుత్వం అన్ని రాజ్యాంగవ్యవస్థలను ధ్వంసం చేస్తుంటే, కోర్టులు చూస్తూ ఊరుకోవాలని స్పీకర్ భావిస్తున్నాడా అని టీడీపీనేత నిలదీశారు.

న్యాయమూర్తులను, కోర్టులను కించపరిచినా, వ్యక్తిగత దూషణలుచేసినా,  వారినికాపాడతామని, విజయసాయిరెడ్డి చెప్పడం, న్యాయ స్థానాలపై ప్రత్యక్షదాడికి పాల్పడమని చెప్పడం కిందకు రాదా అని రవీంద్ర నిగ్గదీశారు. న్యాయస్థానాల స్వతంత్రప్రతిపత్తిని కించపరిచేలా స్పీకర్ మాట్లాడాడని, ఆయన తనకుతానుగా మాట్లాడాడో, ప్రభుత్వం మాట్లాడించిందో చెప్పాలన్నారు.

రాజ్యాంగపదవిలో ఉన్న వ్యక్తి, మరో రాజ్యాంగబద్ధ సంస్థ విధుల్లో జోక్యం చేసుకునేలా, దానిని కించపరిచేలా మాట్లాడటం ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈవిధంగా అనేక అంశాలపై చర్చ జరగాలని, ముందు స్పీకర్ నుంచే అది ప్రారంభం కావాలని కనకమేడల స్పష్టంచేశారు. న్యాయవ్యవస్థను ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడటం అనేది క్షమించరాని నేరమని, తమ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందో లేదో స్పీకర్ తెలుసుకోవాలన్నారు. 

ఎదురుదాడి, తిట్లదండకం తప్ప ప్రభుత్వం ఏం సాధించింది? 
ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చేయడం, తిట్లదండకం అందుకోవడం తప్ప, ఈ ప్రభుత్వం ఏం చేసిందన్నారు? ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ ప్రజల మెప్పు పొందాలనుకోవడం సిగ్గుచేటన్నారు.

ఇసుక కుంభకోణంపై అధికారపార్టీ వారే మాట్లాడుతున్నా ప్రభుత్వం  స్పందించ లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు, ఇప్పుడున్న ప్రభుత్వం మాదిరే వ్యవహరించి ఉంటే, ఇప్పుడు మాట్లాడేవారంతా ఎక్కడుండేవారో స్పీకర్ ఆలోచిం చాలన్నారు. ఏ రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబే కారణమనడం, అన్నింటికీ ఆయనపై నిందలువేయడం, నోటికొచ్చినట్లు తిట్టడం ఎంతమాత్రం భావ్యం కాదని కనకమేడల తేల్చిచెప్పారు. 

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒకసామాజిక సంస్థ పేరుతో అసంబధ్ద ఆరోపణలు చేయించి, దానిని ప్రభుత్వానికిచెందిన సొంతపత్రికలో తప్పుడురాతలురాసి, న్యాయ మూర్తిపై కులపరమైన ఆరోపణలు చేయడం, ఆయన్ని వ్యక్తిగతంగా బెదిరించే స్థాయికి ప్రభుత్వం వెళ్లిందన్నారు.

పథకం ప్రకారం న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేస్తోందని, అందులో భాగంగానే సోషల్ మీడియాలో తమపార్టీ వారితో కోర్టులు, న్యాయమూర్తులపై దాడి చేయిస్తున్నారని, న్యాయమూర్తులకు కులాలు ఆపాదిస్తున్నారని రవీంద్రకుమార్ మండిపడ్డారు. వారి వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసునన్నారు. స్పీకర్ లాంటి వ్యక్తి న్యాయస్థానాలపై చులకనగా మాట్లాడటం న్యాయవ్యవస్థను భయభ్రాంతులకు గురిచేయడం కాదా అన్నారు.

ఇటువంటి చర్యలు చట్టబద్దమైనవి కావని, రాజ్యాంగపరిధిలో ఎవరిపని వారు సక్రమంగా చేసుకుంటే అందరికీ మంచిదని రవీంద్రకుమార్ హితవుపలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించింది ప్రభుత్వమేనని, తప్పులు చేసేవారందరూ ఎప్పటికైనా సరే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడక తప్పదని ఆయన స్పష్టంచేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు కొట్టేసిందని, అంతమాత్రాన కేంద్రం సుప్రీంపై దూషణలకు పాల్పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను, తీర్పులను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, ప్రజాభిప్రాయం పేరుతో, కమిటీల పేరుతో న్యాయస్థానాలను ఉల్లంఘిస్తోందన్నారు.

ప్రత్యక్షంగా చేయలేని దానిని పరోక్షంగా చేయాలని చూడటం కూడా నేరమేనని, ఎన్నికల కమిషనర్ ను తొలగించడం కోసం పదవీకాలపరిమితి తగ్గిస్తూ, దొడ్డిదారిన జీవో తీసుకురావడం కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. మాతృభాషలో విద్యాబోధన చేయడం ఎత్తివేయవద్దని కోర్టు చెబితే, దాన్ని కూడా తప్పుపట్టారన్నారు.

స్పీకర్ ఎన్నికల కమిషనర్ విషయంలో కులాల ప్రస్తావన చేశారని, ప్రస్తుత పాలకులు చేస్తున్న కులాలపాలన ఆయనకు కనిపించకపోవడం విచారకరమన్నారు. స్పీకర్ పదవిలో ఉండి రాజకీయాలు చేయడం తగదని, తన పదవికి రాజీనామాచేశాక ఆయనకు నచ్చినట్లుగా ప్రవర్తించవచ్చన్నారు. వ్యక్తులు, పాలకులు, వ్యవస్థలు అన్నింటినీ అతిక్రమిస్తే చివరకు అరాచకమే మిగులుతుందన్నారు.

పాలకులు పాలనా నిర్వహణలో విఫలమైనప్పుడు మాత్రమే అరాచకం పెచ్చుమీరుతుందన్నారు. ప్రజలు అనుభవించే రాజ్యాంగబద్ధ హక్కులకు రక్షణ లేకుండా చేసి, నేరమే రాజ్యమేలినప్పుడు మాత్రమే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. నేరస్తులే పాలకులైతే నిజాయితీ పరులు జైల్లో ఉండటమే మంచిదన్న నెల్సన్ మండేలా వ్యాఖ్యలు ప్రస్తుతం గుర్తుకొస్తున్నాయన్నారు.

కొల్లురవీంద్రను కావాలనే కుట్రకేసులో ఇరికించారని, హత్య జరిగినప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం, పనిగట్టుకొని ఇప్పుడు ఆయన పేరును తెరపైకి తీసుకురావడం అందులో భాగమేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కనకమేడల వివరణ ఇచ్చారు.

క్రిమినల్ భాషలో ఆఫ్టర్ థాట్ అనే పదం ఉందని, నేరం జరిగాక కాలం గడిచేకొద్దీ కుట్రకోణం కనపడేలా, కొల్లు రవీంద్రను ఇరికించడానికి ప్రభుత్వం ప్రయత్నించడమే దాని అర్థమని రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. కొల్లు రవీంద్రను కుట్రపూరితంగా హత్యకేసులో ముద్దాయిగా చేర్చడంపై  రాజకీయంగా,న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు