ప్రజల కోసం కూలీగా పని చేసేందుకు సిద్ధం : డిప్యూటీ సీఎం పవన్

ఠాగూర్

శుక్రవారం, 23 ఆగస్టు 2024 (15:09 IST)
ప్రజల కోసం కూలీగా కూడా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు. ఇందులోభాగంగా, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న మైసూరావారి పల్లి పంచాయతీలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీల బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను కూడా వివరించారు. ఏపీకి చంద్రబాబు అనుభవం చాలా అవసరమన్నారు. రాష్ట్రాల అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమన్నారు. తనకు స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికి పాలనా అనుభవం లేదన్నారు. అందుకే చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎపుడూ సిద్ధమేనని చెప్పారు. 
 
పంచాయతీలకు ప్రభుత్వపరంగా ఆస్తులు లేకపోతే వ్యర్థమన్నారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని తెలిపారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ భూములు లేని చోట దాతలు ముందుకు రావాలని, తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. 
 
అద్భుతాలు చేయడానికి తమ చేతిలో మంత్రదండం లేదన్నారు. కానీ గుండెల నిండా నిబద్ధత, ధైర్యం ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. ఎంతో పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకు ఉందన్నారు. ప్రజల కోసం కూలీగా కూడా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వైకాపా పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. 75 శాతం గ్రామాల్లో వైకాపా చెందిన సర్పంచ్‌లో ఉన్నారని, ఇపుడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి వెన్నెముక పంచాయతీలేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు