ప్రత్యేక హోదా అంటే ఏమిటో కూడా తెలీని వాళ్లు కూడా దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హేళన చేశారు. హోదాకు అవసరమయ్యే కనీస లక్షణాలు ఆంధ్రప్రదేశ్‌కు లేవని తనకు ముందే తెలిసినప్పటికీ హైదరాబాద్‌ని కోల్పోతున్నందువల్ల ఏపీకి ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతోనే విభజన సమయంలో పార్లమెంటులో ప్రత్యేకహోదా గురించి తానే గట్టిగా వాదించానని వెంకయ్య చెప్పారు. అయితే నాటి యూపీఏ ప్రభుత్వం హోదాకు చట్టబద్ధత కల్పించలేకపోవడం, తర్వాత 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికీ, మామూలు రాష్ట్రానికి తేడా పాటించకూడదని నిర్ణయించడంతో ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేకుండా పోయిందని వెంకయ్య వివరించారు.
ప్రత్యేక హోదా ఉన్నందువల్ల ఒక రాష్ట్రానికి 3 వేల నుంచి 4 వేల కోట్ల రూపాయల మేరకు అదనపు ఆదాయం లభిస్తుందని, ఏపీకి అంత మేరకు ఇవ్వడమే కాక, మరో రూ. 3 లక్షల 50 వేల కోట్ల మేరకు పెట్టుబడులతో సంస్థలు వచ్చేందుకు తాము కృషి చేశామని వెంకయ్య అన్నారు. ఇంత నేపథ్యాన్ని మర్చిపోయి ఆనాడు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడిగావు, గొంతు చించుకున్నావు అని అడగడం సరైంది కాదని అన్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలన్నదని తన అభిప్రాయమని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అడ్డంకులు లేవన్నారు.
ఆంధ్రప్రదేశ్ వాడిగా పనిగట్టుకుని రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తానని, తర్వాత తెలుగువాడిలా ఆలోచిస్తానని.. తర్వాత దేశం గురించి యోచిస్తానని వెంకయ్య నాయుడు చెప్పారు. తాను ఇకపై ఏ ఎన్నికల్లోనూ నిలబడనని.. ఓటు వెయ్యమని ఎవరినీ అడగనని, అలాంటప్పుడు చంద్రబాబుతో తనకేం పని ఉంటుందని వెంకయ్య తేల్చి చెప్పారు.