విశాఖపట్టణంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ సరికొత్త ఆవిష్కరణను రూపొందించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ సోకిందా లేదా అన్నది నిర్ధారించేందుకు వీలుగా ఓ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఈ కిట్‌కు ఐసీఎంఆర్, సీడీఎస్ఈ నుంచి అత్యవసర అనుమతులు కూడా లభించాయి. ఫలితంగా ఈ కిట్‌ను రెండు వారాల్లో దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకునిరానున్నారు.
కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను ఈ మెడ్‌టెక్ అందించింది. తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలిమంకీ పాక్స్ ఆర్టీ పీసీఆర్ కిట్‌ను తయారుచేసింది. తమ భాగస్వామ్య ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్టీ పీసీఆర్ పేరుతో కిట్‌ను అభివృద్ధి చేసింది.
ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం మెడ్‌టెక్ ప్రకటించింది. కిట్‌కు ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో నుంచి అత్యవసర అంగీకారం లభించినట్టు సంస్థ ప్రకటించింది. ఆరోగ్యం రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సిటీ సీఈవో జితేంద్ర శర్మ వ్యాఖ్యానించారు. ఈ కిట్‌ను రెండు వారాల్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.