ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 11 రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.
అలాగే, ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైలకు బుల్లెట్ రైళ్లు నడిపేలా హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు.. అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ నిర్మాణానికి డీపీఆర్‌లను తయారు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు రైల్వేశాఖ డీపీఆర్లు రూపొందిస్తోంది.
ఇప్పటివరకు రైలు అనుసంధానం లేని 11 మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వేశాఖ దృష్టిపెట్టింది. వీటికి గతంలోనే సర్వేలు చేయగా, రైల్వే బోర్డు ఆమోదం నేపథ్యంలో డీపీఆర్లు రూపొందిస్తున్నారు. కొన్నిచోట్ల బైపాస్ లైన్లు, రైల్ ఒవర్ రైల్ వంతెనల నిర్మాణంపైనా దృష్టిపెట్టారు.
హైదరాబాద్-బెంగళూరు మధ్య నిర్మించే హైస్పీడ్ కారిడార్లో ఏపీలో 300 కి.మీ., హైదరాబాద్- చైన్నై హైస్పీడ్ కారిడార్లో.. ఏపీలోని 464 కి.మీ.కు డీపీఆర్లపై దృష్టిపెట్టారు. సరకు రవాణాకు వీలుగా మూడు, నాలుగో లైన్లు..
విజయవాడ-చెన్నై, విజయవాడ- హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం మార్గాల్లో సరకు రవాణా రైళ్ల రాకపోకలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ఈ మార్గాల్లో మూడు, నాలుగో లైన్ల నిర్మాణంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కొన్ని మార్గాల్లో మూడో లైను నిర్మిస్తున్నారు.
ఒడిశా వైపు నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నానికి బొగ్గు, వివిధ ఖనిజాలు రవాణాచేసే రైళ్లు భారీగా ఉంటున్నాయి. దీంతో విశాఖపట్నంలోని సింహాచలం నార్త్ నుంచి కొత్తవలస వరకు ఐదు, ఆరో లైన్ల నిర్మాణానికి డీపీఆర్లు రూపొందిస్తున్నారు.