ప్రభుత్వ వైఫల్యాలపై వినూత్న నిరసనలు... మాజీ మంత్రి దేవినేని ఉమా

బుధవారం, 28 ఆగస్టు 2019 (19:28 IST)
ముడునెలల ప్రభుత్వం వైఫల్యాలపై రాష్ర్ట వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఈ నెల 30వ తేదీన వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

బుధవారం నాడు నందిగామ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కోల్పొయిన నిరుద్యోగులు, మహిళలు, ఆశావర్కర్లు, డ్వాక్రా మహిళలు, రేషన్ డీలర్లు, ఓట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, యానిమేటర్లు, అన్న క్యాంటీన్ల బాధితులు అందరూ ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ఉమా పిలుపునిచ్చారు.

రాష్ర్టంలో కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి, వైకాపా నాయకులు కోట్లు బొక్కేసారని ధ్వజమెత్తారు. అర్థరాత్రిపూట వందలాది ట్రాక్టర్లు, లారీలతో ఇసుక దోపిడి చేస్తున్నట్లు ఆరోపించారు. ట్రక్ ఇసుక కోసం సామాన్యుడు పడరాని పాట్లు పడుతున్నట్లు విచారం వ్యక్తం చేసారు.

ఈకెవైసీ పేరుతో రాష్ర్ట వ్యాప్తంగా రేషన్ కార్డుల తొలగింపుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. ఇసుక దోడిపి కారణంగా 20 లక్షల మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పొయామని, అన్న క్యాంటీన్లు రద్దు చేయటం వల్ల కోటిన్నర మంది నిరుపేదల నోటికాడి కూడును లాగేసారని ఉమా కన్నెర్ర జేసారు.

ఒక్కసారి ఓటెయ్యమని గాల్లోకి చేతులు తిప్పి తిప్పి చూపారని, 90 రోజులు గడిచినా, ప్రజల చేతుల్లో మట్టి పెట్టారని ధ్వజమెత్తారు. పోలవరం పనులను ఆపేసారని, రాజధాని పనులను నిలిపేసారని, పంచాయితీ రాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఉపాధి హమీ వంటి అన్ని పనులను గాలికొదిలి ప్రజలకు ఉపాధి అవకాసాలు లేకుండా చేసారని పేర్కొన్నారు.

అంతకు ముందు కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ప్రమాద వశాత్తు చెరువులో పడిని ముగ్గురు పిల్లల కుటుంబాలను పరామర్శించారు. మార్చురీలో ఉన్న పిల్లల మృతదేహాలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలైన బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు.

గొట్టుముక్కల గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు తరిగొప్పల సాంబయ్య కుటుంబాన్నిప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. కంచికచర్లలో ఆకస్మిక మృతికి గురైన ఎఎంసీ డైరెక్టర్ జులూరి నారాయణరావు బౌతిక కాయాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు