ముంబై నటి జైత్వానీ కిడ్నాప్ కేసులో డైరెక్టర్ సజ్జల.. పాత్రధారులు ముగ్గురు ఐపీఎస్‌లు?

ఠాగూర్

శనివారం, 31 ఆగస్టు 2024 (11:58 IST)
పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై అత్యాచారం కేసుపెట్టినందుకు దక్కిన ప్రతిఫలమే ముంబై నటి జైత్వానీ కాదంబరి కిడ్నాప్, వేధింపులకు కారణమని తేలిపోయింది. ఈ కేసు నుంచి రక్షించాలంటూ సజ్జన్ జిందాల్ నాటి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శరణు వేడటంతో ఆయన ఆదేశాల మేరకు గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ కథకు దర్శకత్వం వహించారు. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. వీరిలో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు కీలకంగా వ్యవహరించగా, మరికొందరు కింది స్థాయి పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. 
 
అయితే, నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇప్పటిదాకా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పేరు వినిపించింది. కానీ, ఆమె సమస్యలన్నింటికీ మూలకారణం ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ వ్యవహారమే ప్రధాన కారణం. అప్పట్లో సజ్జన్ జిందాల్‌పై నటి కాదంబరి జెత్వానీ రేప్ కేసు పెట్టారు. ఈ కేసు ఉపసంహరించుకునేలా చేసేందుకే ఆమెపై తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు వచ్చాయని, తప్పుడు కేసు పెట్టారని తాజాగా వెల్లడైంది. 
 
ఈ మొత్తం వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్ ఒక భాగం మాత్రమేనని... ఇందులో ఏపీకి చెందిన పలువురు ఐపీఎస్‌లు, ఒక ఐఏఎస్, మరికొందరు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి కాదంబరి జెత్వానీ శుక్రవారం ముంబై నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ పోలీసులను కలిసి తాను ఎదుర్కొన్న పరిణామాలను వివరించారు. 
 
దీనిపై కాదంబరి జెత్వానీ న్యాయవాది నర్రా శ్రీనివాస్ మీడియాతో మాట్లాదారు. విజయవాడ పోలీసులు ముంబై నటి జెత్వానీ, ఆమె తల్లి వాంగ్మూలం నమోదు చేస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పోలీసులు తనను ఇబ్బందులకు గురిచేశారన్న విషయాన్ని ఆమె విజయవాడ పోలీసులకు చెబుతున్నారని తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారని న్యాయవాది నర్రా శ్రీనివాస్ వెల్లడించారు.
 
41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారని, నటి జెత్వానీ తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారని వివరించారు. జెత్వానీపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందేనని న్యాయవాది నర్రా శ్రీనివాస్ ఆరోపించారు. జెత్వానీపై ఈ ఒక్క కేసు తప్ప ఎక్కడా ఎలాంటి కేసులు లేవని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది నర్రా శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను హనీ ట్రాప్ చేసిందన్న ఆరోపణల్లో నిజం లేదని జెత్వానీ స్పష్టం చేస్తున్నారని నర్రా వివరించారు. సోషల్ మీడియాలో కానీ, ఇతర మీడియా వేదికల్లోనూ తనపై దుష్ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు