టీటీడీ అధికారి పుణ్య‌మా అని, మీడియాకు అక్రిడిటేషన్ గోవిందా!

శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:06 IST)
దశాబ్దాల తరబడి జర్నలిస్టులుగా కొనసాగుతున్న వారికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా, అధికారులు తమ ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కార్యకర్తలకు, ఎస్ వి బి సి ఛానల్ ఉద్యోగులకు, అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తున్నార‌ని తిరుమ‌ల‌లోని సీనియ‌ర్ పాత్రికేయులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో దాదాపు 4 వేల మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 760 మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశారు. అందులోనూ ఇప్పటివరకు సాక్షి పత్రికకు మినహా మిగిలిన వారికి చేతికి కార్డులు కూడా అందలేదు. చిన్న మధ్యతరహా పత్రికల ఆన్లైన్ దరఖాస్తులను ఇప్పటి వరకు కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. జిఎస్టి నిబంధనల పేరుతో చిన్న మధ్యతరహా పత్రికల ప్రతినిధులకు సమాచార శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. 
 
టీటీడీ లో ఉన్నతాధికారిగా పని చేస్తున్న ఒక‌ మిత్రుడి కోరిక తీర్చేందుకు కోసం 142 జీవో లోని నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యేకంగా ఆదేశాల జారీ చేశారు. ధార్మిక సంస్థ అయిన టిటిడిలోని ఓ ఉన్నతాధికారి సూచించిన వారికి తిరుమలలో అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని అక్రమ పద్ధతిలో ఆదేశాలు జారీ చేశారు. అసలు ప్రభుత్వం విడుదల చేసిన 142 జీవోను ఖచ్చితంగా అమలు చేయాల్సిన సమాచార శాఖ కమిషనర్ స్వయంగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ, వ్యక్తిగత అభిప్రాయాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ కు వివాదాస్పద లేఖ రాసారు. ఇపుడు దీని వెనుక అసలు వ్యవహారం ఏమై ఉంటుంది అనే దుమారం చెలరేగుతోంది.
 
మీడియాపై ధార్మిక సంస్థ పెత్తనం ఏమిటో అర్థం కాదు. ఇలా పెత్తనం చేయడానికి టిటిడిలోని అధికారికి రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ అధికారం ఇవ్వడం ఏమిటో? దీని వెనుక వ్యవహారం ఏమిటో?  బోధ‌ప‌డ‌టం లేద‌ని జర్నలిస్టు సంఘాలు మండిప‌డుతున్నాయి.  
 
వాస్తవానికి జర్నలిస్టులు అందరూ వ్యతిరేకిస్తున్న 142 జీవోలో తిరుమల కొండకు అక్రిడిటేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా జర్నలిస్టులకు లేకుండా, ఆన్లైన్ విధానంలో తిరుమల అనే ఆప్షన్ తొలగించారు. దీనిపై తీవ్రమైన ఒత్తిడి రావడంతో తప్పని పరిస్థితుల్లో రెండవ దశలో పరిమితంగా తిరుమలకు అక్రిడేషన్లు జారీ చేయడానికి అంగీకరించారు. దీంతో తిరుమల లో పనిచేస్తున్న వారందరూ ఆన్లైన్ విధానంలో అక్రెడిటేషన్  కార్డులు మంజూరు కోసం రెండవ సారి దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఇదే అదనుగా తీసుకుని మీడియాపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న తిరుమలలోని ఉన్నతాధికారి తనకు వంత పాడే, 17 మందిని  ఎంపిక చేసుకొని మరీ వారికి అక్రెడిటేషన్ కార్డులను ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేశారు. ఒకవైపు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి లేఖ, మరోవైపు టిటిడి ఉన్నతాధికారి సిఫార్సు మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ 17 మందికి మాత్రమే తిరుమల ప్రాంతంలో పని చేసేందుకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశారు. ఇందులో ముఖ్యమైన మీడియా సంస్థలను కూడా పక్కన పెట్టేశారు. ఏ ప్రాతిపదికన అక్రెడిటేషన్ కార్డులను జారీ చేశారో కూడా తెలియలేదు. తిరుమల కొండపై పనిచేస్తున్న దాదాపు 100 మందిలో ప్రముఖ సంస్థలలో యాభై మంది జర్నలిస్టులు గత కొన్ని దశాబ్దాలుగా అక్రెడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారు.

ఇవన్నీ పట్టించుకోకుండా తిరుమల కొండపై దేవుడి పేరుతో అధికారం వెలగబెడుతున్న అధికారులు మీడియా సంస్థల పై పరోక్ష దాడులకు దిగుతున్నారని, అర్హులైన అందరికీ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని అన్యాయానికి గురైన కొంతమంది జర్నలిస్టులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ కు ఫిర్యాదు చేశారు. దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఏకంగా తన చేతుల్లో ఏమీ లేదని నిస్సహాయతను ప్రకటించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి  రెండు దఫాలుగా టిటిడి ఉన్నతాధికారులతో మాట్లాడినా ప్రయోజనం కనిపించ లేదు. 
 
దీంతో ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ టీటీడీ జరుగుతున్న మీడియా దాడిపై నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అసలు తిరుమల భక్తులకు సౌకర్యాలు కల్పించే పనులు చూడాల్సిన టీటీడీ ఉన్నతాధికారులకు మీడియా  పెత్తనం చెలాయించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా తనకు కావలసిన భజన చేసే వారికి గుర్తింపు ఇవ్వదలిస్తే, టిటిడి తరఫున గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అలా ఇస్తే తమకు అభ్యంతరం లేదని యూనియన్ నాయకులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు