జగన్ ను జాతిపితతో పోల్చడం సిగ్గుచేటు: నాదెండ్ల బ్రహ్మం

శనివారం, 3 అక్టోబరు 2020 (09:25 IST)
జాతిపిత జయంతి నాడు అవినీతిమురికి పత్రికలో వచ్చిన కథనాలను మన్నించాలని ఆ మహాత్ముడిని కోరుతున్నానని, ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాలరాస్తున్న జగన్మోహన్ రెడ్డిని, జాతిపితతో పోల్చడం దారుణమని టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మం ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు దోచేసి, తన అవినీతిసంపదను విదేశాలకు, పొరుగు రాష్ట్రాలకు తరలించి, 16నెలలు జైలుజీవితం గడిపిన ఒక దోపిడీదారుని, మహాత్ముడితో పోలుస్తూ, గాంధీ మళ్లీ పుట్టాడని అవినీతిపుత్రిక అయిన సాక్షిలో రాయడం సిగ్గుమాలినతనమన్నారు. 

వైసీపీనేతలు, సాక్షి సిబ్బంది కొడాలినానీ స్కూల్లో చదివారు కాబట్టే అటువంటి ఉపమానాలతో, పిచ్చిరాతలు రాశారని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను వయలెన్సుకి వారియర్స్ గా మార్చిన వైసీపీ ప్రభుత్వం, సదరు వ్యవస్థ పనితీరుకి చప్పట్లుకొట్టాలని జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రప్రజలంతా వాలంటీర్లను చెప్పుతో కొట్టాలా.... చెట్టుకుకట్టేసికొట్టాలా అని ఆలోచిస్తున్నారన్నారు.

తాము చదివిన చదువులకు విలువలేకుండా పోయిందని, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో నిరుద్యోగులంతా వాపోయారని, ఆనాడు వారి బాధలు విన్న, మాజీ ముఖ్యమంత్రి, అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేశాడన్నారు. నిరుద్యోగులకు  ఆర్థికభరోసా కల్పించడం కోసం చంద్రబాబు నాయుడే నిరుద్యోగ భృతిని కూడా అందించారన్నారు.

బ్యాక్ లాగ్ పోస్టులు సహా, ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత టీడీపీ అధినేతదని బ్రహ్మం చౌదరి తేల్చిచెప్పారు. పాదయాత్ర సమయంలో నిరుద్యోగులను ఆదుకుంటానన్న జగన్, అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉపాధికల్పించే పథకాలను నిలిపివేశారన్నారు. 

ముఖ్యమంత్రి అవినీతి, అనుభవరాహిత్యం కారణంగా చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ వెనక్కువెళ్లిపోయాయని రాష్ట్రంలోని నిరుద్యోగులు అంతా ఘొల్లుమంటున్నారని నాదెండ్ల తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వీల్లేకుండా, జగన్ తెచ్చిన జీవో నిరుద్యోగుల కాళ్లకు బంధాలు వేశాడన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధిలేని ఆంధ్రాగా మారితే, యావత్ రాష్ట్రం మొత్తం నిరుద్యోగాంధ్రాగా మారిందని బ్రహ్మం ధ్వజమెత్తారు. 

చంద్రబాబు అమలుచేసిన నిరుద్యోగ భృతిని జగన్ ప్రభుత్వం పునరుద్ధరించాలని, ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని టీఎన్ఎస్ఎఫ్ నేత డిమాండ్ చేశారు. పాదయాత్రలో చెప్పినట్టుగా జగన్, తక్షణమే విభజన చట్టంప్ర్రకారం భర్తీచేస్తానన్న ఉద్యోగాలను భర్తీచేయాలన్నారు. నిరుద్యోగులకు, యువతకు జగన్ ఇచ్చిన హామీలను  తక్షణమే నెరవేర్చకుంటే, వారితోకలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బ్రహ్మం హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు