రేవంత్ రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు.. లేఖలో ఏముంది?

శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (10:42 IST)
కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారంటూ సంచలన అంశాలతో కూడిన ఓ లేఖ మీడియాకు పోలీసులకు అందడంతో.. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో కోటిన్నర నగదును.. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం వస్తోంది. 
 
ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలని అధికారులు వేసిన ప్రశ్నలకు రేవంత్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. బంగారు నగలపైనా బిల్లులు చూపాలని అధికారులు అడగ్గా, అవి తమ పూర్వీకుల నుంచి వచ్చినవని రేవంత్ కుటుంబీకులు సమాధానం ఇచ్చినట్టు అనధికార వర్గాల సమాచారం. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 
 
మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మాదాపూర్‌లో ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొండల్ రెడ్డి భార్యను అదుపులోకి తీసుకున్న అధికారులు, బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకెళ్లారు. ఆ లాకర్లలో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు ఉండివుండవచ్చని ఈడీ భావిస్తోంది. మరోవైపు రేవంత్‌రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారంటూ మీడియా సంస్థలకు అందిన లేఖలో.. రేవంత్‌కు హాంకాంగ్‌, కౌలంపూర్‌ల్లోనూ బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో కోట్ల రూపాయలు జమయ్యాయి. 
 
ఒకే రోజు రూ.20 కోట్లకు పైగా విలువైన విదేశీ కరెన్సీ రేవంత్‌ ఖాతాల్లో జమయింది. 2014 ఎన్నికలకు ముందే ఈ మొత్తం వచ్చినా ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదు. ఎందుకంటే ఈ సొమ్ము మనీల్యాండరింగ్‌, హవాలా తదితర మార్గాల్లో వచ్చింది.
 
2014 నుంచి 2017 వరకు ఐటీ రిటర్న్‌ ప్రకారం రేవంత్‌రెడ్డి, ఆయన భార్య ఆదాయం ఏడాదికి రూ.ఆరు లక్షలకు మించి లేదు. కానీ భారీగా ఆస్తులు కొన్నారు. రుణాలు కూడా తీసుకున్నారని ఆ లేఖలో వుంది. వీటిపై ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు