మరణంలోనూ జంటగా చనిపోయిన ఎస్వీ ప్రసాద్

మంగళవారం, 1 జూన్ 2021 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కరోనాతో మరణించిన కొన్ని గంటల తేడాతో ఆయన అర్థాంగి లక్ష్మి కూడా తుదిశ్వాస విడిచారు. ఆమె కూడా కరోనాకు చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచారు. మరణంలోనూ వారు జంటగానే సాగారు. ఈ వార్త విన్న ఆయన కుటుంబీకులు తీవ్ర విషాదంలో కూరుకునిపోయారు. 
 
ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిపాలనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వ్యక్తి ఎస్వీ ప్రసాద్ అని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2010లో ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా వ్యవహరించారు. అనేకమంది సీఎంలకు సెక్రటరీగా వ్యవహరించారు.
 
అటు, ఎస్వీ ప్రసాద్ మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎస్వీ ప్రసాద్తో తనకు సుదీర్ఘమైన అనుబంధం ఉందని తెలిపారు. ఎస్వీ ప్రసాద్ వంటి కార్యదక్షత ఉన్న అధికారులు అండగా ఉంటే, ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోతుందని కొనియాడారు. నిజాయతీపరుడైన వ్యక్తిగా చిరస్మరణీయుడని పేర్కొన్నారు.
 
ఇటు ఎస్వీ ప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎస్వీ ప్రసాద్, ఆయన భార్య ఒకేసారి కన్నుమూశారన్న వార్త తెలిసి తాను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయం తనకెంతో బాధను కలిగించిందని తెలిపారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఎస్వీ ప్రసాద్ ఎంతో నిబద్ధత గల ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు కొనియాడారు. 'వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు