ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై మీడియా ద్వారా సీఎంను నిలదీసినందుకు, అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి బెయిల్ రద్దుచేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకు కక్షకట్టి తనపై ఏపీ సీఐడీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వేధించి, దుర్మార్గంగా కొట్టారని నరసాపురం వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని, చట్టాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించిన సీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని రఘురామరాజు విజ్ఞప్తి చేశారు. రఘురామ తెలిపిన వివరాలన్నీ సానుకూలంగా విన్న ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ ప్రఫుల్లా చంద్ర పంత్.. ఈ ఘటనపై విచారణ జరిపించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు రఘురామ వర్గీయులు చెప్తున్నారు.
ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తనను కొట్టారని, కస్టడీలో ఉండగానే కొందరు పోలీసులు ముసుగులతో వచ్చి తీవ్రంగా గాయపరిచి, మానవ హక్కులను ఉల్లంఘించారని రఘురామకృష్ణంరాజు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఆయన ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ ప్రఫుల్లా చంద్ర పంత్‌ను కలిసి, సీఐడీ పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును వివరించారు. కాగా, రఘురామరాజు తనయుడు భరత్‌తోపాటు మరికొందరు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీకి ఇదివరకే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.