జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు.. నాకు పాలిటిక్స్‌పై అవగాహన లేదు : పవన్ కళ్యాణ్

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (09:26 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అదేసమయంలో తమ పార్టీ జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదని ప్రజాసేవ చేయడమే లక్ష్యమన్నారు. తద్వారా ఎన్నికల్లో పోటీపై సందిగ్ధత నెలకొల్పారు. 
 
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు అమెరికా తన భార్యతో కలిసి వెళ్లిన పవన్ కళ్యాణ్... న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదన్నారు. సినిమాలకన్నా ప్రజాసమస్యలపై పోరాటమే తనకు సంతృప్తినిచ్చిందని పవన్ తెలిపారు. 
 
కుల రాజకీయాలు తనకు నచ్చవని, అన్యాయాన్ని చూస్తూ కూర్చోలేనన్నారు. రాజకీయాల్లోకి రావడం కంటే సమాజాన్ని చదవడమే తనకు అమితమైన ఇష్టమన్నారు. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన లేకపోయినా.. సమాజాన్ని చదివే అలవాటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.
 
ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించినప్పుడు తనకు నిజమైన సంతృప్తి లభించిందని చెప్పారు. దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి మనమేమిచ్చామని ఆలోచించాలని అన్నారు. సినిమాల కన్నా ఎక్కువగా ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడు సంతృప్తి లభించిందని అన్నారు.
 
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది భయపెట్టారని, చంపేస్తారని బెదిరించారని చెబుతూ భయపడితే ఇంతా దాకా వస్తామా? అని అడిగారు. తనకు జాగ్రత్త ఉంది గానీ భయం లేదన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కుంటానని అన్నారు. రోజూ చావడం కన్నా ఒక్క రోజు చావడం మంచిదని అన్నారు.
 
గతంలో తన దర్శకత్వంలో వచ్చిన 'జానీ' సినిమా సక్సెస్ అయి ఉంటే సినిమాలు వదిలేసేవాడినేమో అన్నారు. సినిమాల్లో సంతోషం ఉందని అన్నారు. సినిమాల ద్వారా ఇమేజ్ వస్తుందన్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్‌ను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వాడుకుంటానని చెప్పారు. అందుకే సినిమాలు చేస్తానని చెప్పారు. బాధ్యతలు ఎక్కువైనప్పుడు సినిమాలకు దూరంగా ఉంటామనేమో గానీ వదిలేయనన్నారు. 
 
సినిమాల ద్వారా ఇమేజ్, డబ్బూ వస్తుందని చెప్పారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు చెప్పబోనని అన్నారు. మీలో నుంచి నాకు బలమైన నాయకత్వం కావాలని అన్నారు. రాజకీయాల పిల్లలు తప్ప మిగతా వాళ్లు వాళ్లకు యూత్ కాదని అన్నారు. పార్టీని విస్తరించాలని ఉందని, మీలాంటి కోసం చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి