ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్‌రెడ్డి గారికి... ఇట్లు పవన్ కల్యాణ్

మంగళవారం, 30 జులై 2019 (20:33 IST)
మీరు కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏ ప్ర‌భుత్వం అయినా స్థిర‌ప‌డ‌డానికి కొంత కాలం అవ‌స‌రం. దీనిని దృష్టిలో ఉంచుకుని క‌నీసం 100 రోజుల పాటు ఎటువంటి ప్ర‌జా డిమాండ్ల‌ను మీ ముందు ఉంచకూడ‌ద‌ని జ‌న‌సేన నిర్ణ‌యించుకుంది. అందువ‌ల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు అనేక విజ్ఞాప‌న‌లు జ‌న‌సేన‌కు అంద‌చేస్తున్న‌ప్ప‌టికీ జ‌న‌సేన సంయ‌మ‌నం పాటిస్తోంది.
 
అయితే భ‌వ‌న నిర్మాణ కార్మికులు అర్ధాక‌లితో ప‌డుతున్న బాధ‌లు చూసిన త‌ర్వాత మీకు ఈ లేఖ‌ను త‌ప్ప‌నిస‌రై రాస్తున్నాను. ఇసుక కొర‌త‌తో రాష్ట్ర వ్యాప్తంగా భ‌వ‌న నిర్మాణ ప‌నులు ఆగిపోయిన సంగ‌తి మీకు తెలుసు. ఫ‌లితంగా ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితేనే గాని డొక్క నిండ‌ని భ‌వ‌న నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు. గ‌త కొద్దిరోజులుగా వీరి నుంచి మా పార్టీకి అనేక విన‌తి ప‌త్రాలు అందాయి. 
 
ఈ రోజు స్వ‌యంగా కొంద‌రు కార్మికులు మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కార్యాల‌యంలో న‌న్ను క‌ల‌సి వారి బాధ‌ల‌ను వెళ్ల‌బోసుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాటికి ఇసుక‌పై ప్ర‌భుత్వ పాల‌సీని ప్ర‌క‌టిస్తామ‌ని మీరు ప్ర‌క‌టించి ఉన్నారు. అయితే అప్ప‌టిదాకా కూలీనాలి చేసుకునే కార్మికులు ప‌స్తులుండే ప‌రిస్థితి నెల‌కొంది. ఇది మ‌న రాష్ట్రానికి క్షేమ‌క‌రం కాదు. అందువ‌ల్ల వీరిని త‌క్ష‌ణం ఆదుకుని వారికి ఉపాధి క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. వారి భృతికి భ‌రోసా క‌ల్పించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.
 
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన‌ ఇసుక మైనింగ్‌ అవ‌క‌త‌వ‌క‌ల‌పై నేను అనేక సంద‌ర్భాల‌లో మాట్లాడడం జ‌రిగింది. మీరు తీసుకువ‌చ్చే కొత్త ఇసుక మైనింగ్ పాల‌సీ ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా ఉండ‌రాద‌ని జ‌న‌సేన పార్టీ కోరుతోంది. ఇళ్లను నిర్మించుకునే ప్ర‌జ‌లు, కాంట్రాక్ట‌ర్లు, కార్మికుల‌కు అనుకూలంగా మీ ఇసుక పాల‌సీ ఉన్న‌ట్ల‌యితే, అటువంటి పాల‌సీకి జ‌న‌సేన పార్టీ కూడా మ‌ద్ద‌తు ఇస్తుంది. 

ఇసుక పాల‌సీ రావ‌డానికి ఇంకా కొంత స‌మ‌యం ఉన్నందున త‌క్ష‌ణం భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను ఆదుకోవాల‌ని జ‌న‌సేన పార్టీ కోరుతోంది. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు జ‌న‌సేన స‌దా అండ‌గా ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌చేస్తున్నాము అంటూ పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు