జగన్ రెడ్డి గారి రెండేళ్ల పాలన అంటూ, జనసేన నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. రెండేళ్ల పాలనలోనే, మహిళలు రోడ్ల మీదకు వచ్చి అర్జీలు ఇచ్చే పరిస్థితికి తీసుకువచ్చారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పథకాలన్నింటికీ జగనన్న పేరు పెడతారు గానీ, ఆ అన్న ఎవరికీ కనబడడు.. వినబడడు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు వేసింది లేదని, ఒక్క ట్రక్కు మట్టి పోసింది లేదని చెప్పారు. ఉన్న రేషన్ కార్డులు, పెన్షన్లు తీసేస్తారని, అవి మాత్రం పేపర్ ప్రకటనల్లో మాత్రమే కనబడుతాయన్నారు.
నరసరావుపేటలో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, "పల్నాటి పౌరుషం అంటారు.. ప్రాంతాన్ని పట్టించుకోరు. పల్నాటి పౌరుషం అన్న పదాన్ని నేటి తరం నాయకులు దుర్వినియోగం చేశారు. బ్రహ్మనాయుడు స్ఫూర్తిని మరిచారు. రోషం గురించి మాట్లాడుతారు.. ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయరు. ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి వాగ్దానాలు చేశారు. అధికారం ఇస్తే ఏడాదికల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటారు. కనీసం రక్షిత మంచినీటిని కూడా అందించలేరు. నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా ఇక్కడ ప్రజలకు గుక్కెడు నీరు లభించని పరిస్థితి అని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు.