తూచ్... రాజీనామాపై వెనక్కి తగ్గిన ఎంపీ జేసీ దివాకర్

గురువారం, 21 సెప్టెంబరు 2017 (18:25 IST)
అధికార పార్టీ టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. చాగల్లు రిజర్వాయర్ నుంచి తాడిపత్రికి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. దీంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. 
 
అనంతపురం ఎంపీగా ప్రజలకు ఏమీ చేయలేకపోయాని దివాకర్‌ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాడిపత్రి నియోజకవర్గానికి నీళ్లు తీసుకురాలేకపోయానని, అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. ప్రజల మేలుకోసం ఉపయోగపడని పదవి ఎందుకంటూ.. తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
 
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబుతో ఏపీ భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమ, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, అనంతపురం కలెక్టర్‌ వీరపాండ్యన్‌తో చర్చలు జరిపారు. చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలని, తుంగభద్ర ఎస్‌ఈ శేషగిరిరావు, సీఈ జలందర్‌కు ఆదేశించారు. 
 
పీఏబీఆర్‌ నుంచి చాగల్లు రిజర్వాయర్‌కు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని మంత్రి దేవినేని ఆదేశించారు. నీటిని విడుదల చేసి.. తుంగభద్ర ఎస్‌ఈ దివాకర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఆ వెంటనే జేసీతో దేవినేని ఉమ ఫోన్‌లో మాట్లాడారు. జీడిపల్లి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం కోసం ఆగామని, చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశామని ఉమ చెప్పారు. మంత్రి దేవినేని ఫోన్‌తో జేసీ దివాకర్‌ రెడ్డి మెత్తబడ్డారు.

 

Could not get any work done, will resign, says TDP MP JC Diwakar Reddy. Clarifies he won't quit politics @NewIndianXpress pic.twitter.com/ALkQviP6id

— kalyan chakravarthi (@Kalyan_TNIE) September 21, 2017

వెబ్దునియా పై చదవండి