ప్రజలే దేవుళ్ళు. సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణగారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాక్షిస్తున్నాం.. అంటూ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావులు ట్విట్టర్లో తెలిపారు. ఇలా సుహాసినికి ఇద్దరు మద్దతు పలికారు. కానీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికల ప్రచారంపై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. నందమూరి సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై నందమూరి హీరో బాలయ్య స్పందించారు. సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం తమ పార్టీ పుట్టిందన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్, చంద్రబాబు ఎనలేని కృషి చేసారన్నారన్నారు.