పదవి మూణ్ణాళ్ళ ముచ్చటగా చేసుకోవద్దు : జగన్‌కు ముద్రగడా సలహా

శుక్రవారం, 3 జులై 2020 (15:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కాపు  నాయకుడు ముద్రగడ పద్మనాభం కీలక సూచన చేశారు. ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ళ ముచ్చట చేసుకోవద్దంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిలా పూజలు అందుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, పదవుని ఓ అలంకార ప్రాయంగా భావించరాదన్నారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. 
 
అందులోని అంశాలను పరిశీలిస్తే, ప్రజల కష్టాల్లో పాలకులు పాలుపంచుకోవాలని హితవు పలికారు. తమ జాతి సమస్య తీర్చాలని ప్రధాని మోడీని జగన్‌ కోరాలన్నారు. అడిగిన వారికి, అడగని వారికి, హామీలు ఇవ్వని, ఇచ్చిన వాటికి దానాలు చేసి దానకర్ణుడు అని జగన్‌ అనిపించుకుంటున్నారని, అయితే, తమ జాతి చిరకాల కోరికను నెరవేర్చట్లేదని చెప్పారు.
 
తమకు బీసీ రిజర్వేషన్‌ల విషయంపై 2016లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాపుల కోరిక సమంజసం అని జగన్ చెప్పారని తన మిత్రులు చెబితే విన్నానని అన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై జగన్ మద్దతు ఇచ్చారని విన్నానని అన్నారు. ఈ రోజు తమ కోరికను తీర్చడానికి జగన్‌కు ఎందుకు చేతులు రావడం లేదు జగన్‌గారూ అని మీడియా లేఖ ద్వారా ప్రశ్నించారు. 
 
మీ విజయానికి మా జాతి సహకారం కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్లా మీరు పొందలేదా? ఎన్నికలు జరగకముందు ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ జాతిని, ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులతో చేయించిన దమనకాండ, అరాచకాలు, అవమానాలను వైసీపీ తమ ఛానెల్‌లో చూపించిందే చూపించిందని, తమ జాతి సానుభూతి, ఓట్లు పొందిందని చెప్పారు.
 
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిలా పూజలందుకోవాలే గానీ, పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని జగన్‌కు సూచించారు. దయచేసి తమజాతి సమస్య తీర్చమని భారత ప్రధాని గౌరవ మోడీని కోరాలని జగన్‌కు రాసిన లేఖలో కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు