మృత్యువులోనూ ఒకరినొకరిని వీడని అక్కాచెల్లెళ్లు...

ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (12:56 IST)
వారు ఒకే తల్లి కడుపున పుట్టారు. ఒకే ఇంట్లో పెరిగిపెద్దవారయ్యారు. కలిసిమెలిసి జీవించారు. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఒకే భర్తతో అన్యోన్యంగా సంసార జీవితం కొనసాగించారు. చివరకు మరణంలోనూ ఇద్దరూ విడిపోలేదు. అలాంటి అక్కాచెల్లెళ్ల మరణ వార్త విన్న ఆ గ్రామం కన్నీరుకార్చింది. 
 
కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్‌ - వరంగల్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో శంకరపట్నం మండలానికి చెందిన అక్కా చెల్లెళ్లు సుజాత (35), సులోచన (28) అక్కడికక్కడే మరణించారు. ఓ గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
దీంతో సుజాత - సులోచనలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అక్కాచెల్లెళ్ల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు. 
 
మరోవైపు, ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల ఘాట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లివ్యాను బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంద్రవెల్లి మండలం సమ్మక్క నుంచి సంతోలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు