కరీంనగర్ జిల్లాలో దారుణం.. ప్రేమించాడని రాళ్లతో కొట్టి చంపేశారు..

శుక్రవారం, 21 అక్టోబరు 2016 (14:28 IST)
ప్రేమ వివాహం చేసుకుందామనుకున్న పాపానికి ఆ ప్రేమికుడిని రాళ్ళతో కొట్టి చంపిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డామ్ లక్ష్మి కాలనీకి చెందిన వ్యక్తి.. అదే కాలనీకి చెందిన మౌనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. మౌనిక ఇంటర్మీడియెట్ చదివింది. 
 
అనిల్ మాత్రం అదే ఊరిలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ పెళ్ళి వరకు వచ్చింది. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో వాళ్ళ ప్రేమ సుఖాంతమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వీరి ప్రేమకు పెద్దలు రెడ్ సిగ్నల్ ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు ఈ ప్రేమ పెళ్ళికి అంగీకరించలేదు. 
 
పెళ్లి చేసుకుంటే పెద్దలు మారుతారనుకుని, అనిల్, మౌనికలు స్థానిక లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంకొద్దిసేపట్లో పెళ్ళి అనగానే ఈ విషయం మౌనిక కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో జనంతో వచ్చిన మౌనిక కుటుంబసభ్యులు అనిల్‌పై రాళ్లతో కొట్టారు. ఆపై గొంతు కోశారు. దీంతో అనిల్ మృతి చెందాడు. మౌనికను కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి