22 ఎంపీలు పెట్టుకుని మెడలు వంచలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా?

మంగళవారం, 30 మార్చి 2021 (15:17 IST)
తన పార్టీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ ప్రగల్భాలు పలికి వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇపుడు కేంద్రానికి దాసోహమయ్యారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రారావు ఆరోపించారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి మరో ఎంపీ ఇవ్వడం వల్ల ఒరిగేది ఏమీలేదన్నారు. గత రెండేళ్ళ కాలంలో సీఎం జగన్ రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయలేని జగన్ ప్రభుత్వానికి మరో ఎంపీ అవసరమా? అని నిలదీశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన జగన్, ఇప్పుడెందుకు దాని ఊసెత్తడంలేదన్నారు. 
 
రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన రూ.24వేల కోట్లపై  వైసీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయరని కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు. 
 
28 మంది ఎంపీలను ఉంచుకొని, ఏపీకి ఏమీ సాధించలేని వ్యక్తికి, మరో ఎంపీని గెలిపించమనే అర్హత లేదన్నారు. విశాఖఉక్కు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు ఏమయ్యాయో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ఓట్లకోసం తమ ముందు కొచ్చే వైసీపీ నేతలను, ముఖ్యమంత్రిని ప్రజలంతా నిలదీయాల్సిన సందర్భం వచ్చిందన్నారు. కేసుల భయంతోనే ముఖ్యమంత్రి, కేంద్రం ముందు నోరెత్తడం లేదని ఇది ప్రజలు గ్రహించాలని కిమిడి కళావెంకట్రావు గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు