ఈ భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని... సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానన్నారు. ఉమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇదే కోవలో పార్టీలోకి ఆహ్వానించామని.. కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇక నిర్ణయం తీసుకోవాలని ఉమెన్ చెప్పారు.
మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ వీడిన నేతలను మళ్లీ ఆహ్వానించాలంటూ చెప్పారని... ఆయన సూచన మేరకే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించామని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తెలిపారు. ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటానని కిరణ్ చెప్పారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడేనన్నారు.