హైదరాబాద్ నగరంలో సోమవారం (జనవరి 13వ తేదీ) నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ జరుగనుంది. ఈ ఫెస్టివల్‌లో 20 నుంచి 40 దేశాలకు చెందిన అంతర్జాతీయ కైట్‌ప్లేయర్స్, 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది కైట్‌ప్లేయర్స్ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 13 (సోమవారం) నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జరుగనున్నది. కైట్‌ఫెస్టివల్‌లో 20 నుంచి 40 దేశాల అంతర్జాతీయస్థాయి కైట్‌ప్లేయర్స్, 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది కైట్‌ప్లేయర్స్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన కైట్‌ప్లేయర్స్ కూడా పాల్గొంటారన్నారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లో స్వయంగా తయారుచేసిన 1000 రకాల స్వీట్లు, తెలంగాణ వంటలు అందుబాటులో ఉంచుతారన్నారు. కైట్‌ఫెస్టివల్‌లో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఈ ఫెస్టివల్‌కు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో కైట్ ఫెస్టివల్ వారంపాటు నిర్వహిస్తామన్నారు.
అనంతరం పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి బోర్డు ఛైర్మన్ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, క్లిక్ ప్రతినిధులు బెంజిమెన్, అభిజిత్, వీణ పాల్గొన్నారు.