గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆ పార్టీ నేతలు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, గోదావరి జిల్లాల్లో గట్టిగా పట్టున్న పాత, కొత్త కాపులను చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.
ఇందులోభాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. టీడీపీలో చేరేందుకు ఆయన మంతనాలు జరుపుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీ అధినేత జగన్ తీరుపై కొత్తపల్లి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని అంటున్నారు.
కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకపుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. గతంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైదొలిగి.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాకు.. జగన్ పార్టీలో చేరి పగో జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.