ప్రతిష్ఠాత్మకమైన చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో తమ ప్రాభవాన్ని చూపించుకోవాలని అధికార వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక్కడి మున్సిపాలిటీని చేజిక్కించుకుని ఆ విజయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందించాలని తపన పడుతున్నారు.
మరో పక్క టీడీపీ నేతలు కూడా కుప్పం ఎన్నికలను తమ వ్యక్తిగత పరువుగా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర తమ పరువు నిలబడాలని వారు కూడా వైసీపీతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. ఈ దశలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు రణ రంగాన్ని తలపిస్తున్నాయి. తమ అభ్యర్థులను కనీసం నామినేషన్ వేయనీయడం లేదని, వేసిన వార్డు మెంబర్ల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో చెల్లనివిగా చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
కొందరు అధికారులు, పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. తమ నామినేషన్లను చెల్లనివిగా ప్రకటించారని కుప్పం మున్సిపల్ కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులు ధర్నా చేస్తుండగా, పోలీసులు వారిని బలవంతంగా మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు తోసేశారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
పోలీసులకు, తెలుగుదేశం నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. కుప్పం మున్సిపాలిటీ నామినేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని బయటకు లాక్కుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ పెనుగులాటలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చొక్కాను పోలీసులు చించేశారని తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం ఎన్నికలు ముగిసేసరికి ఇంకెన్ని దొమ్మిలు జరుగుతాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.