వైసీపీ నుంచి టీడీపీకి బుట్టా రేణుక జంప్? నారా లోకేష్‌ను ఎందుకు కలిశారు..?

శనివారం, 15 జులై 2017 (15:44 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ద్వారా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత, నాయకులపై దుమ్మెత్తిపోసిన వైకాపా సభ్యులకు పెద్ద షాక్ తగలనుంది. ప్లీనరీ ద్వారా ప్రజల్లో తదుపరి ప్రభుత్వం తమదేనని చెప్పకనే చెప్పిన వైకాపా చీఫ్ జగన్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా వైకాపాలో వికెట్ పడనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే? వైసీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. 
 
హైదరాబాదులో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రేణుక డుమ్మా కొట్టారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రేణుక హాజరుకాకపోవడంపై అందరూ షాక్ తిన్నారు. అయితే కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ను బుట్టా రేణుకా కలిశారు. దీంతో ఆమె పార్టీ మారడం ఖాయమని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాదులో శనివారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం 30 నిమిషాల్లోనే ముగిసింది. ఈ సందర్భంగా తమ ఎంపీల పని తీరు పట్ల జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరుకాని కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతోపాటు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడటం పక్కనబెట్టి.. ప్రజా సేవలో మమేకం కావాలని ఎంపీలకు జగన్ హితవు పలికినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి