హైదరాబాద్ నగరం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని. అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న భాగ్యనగరం. అదేసమయంలో ఎన్నో రకాల చీకటి వ్యాపారాలకు, నేరాలకు ఘోరాలకు అడ్డాగా ఉంది. ఇపుడు యువతీయువకుల సహజీవనానికి నిలయంగా మారిపోయింది. ఇవి చివరకు ఎంతో మంది అమ్మాయిలకు తీరని వ్యధలు మిగులుస్తున్నాయి.
మారుతున్న జీవన శైలి, ఉద్యోగ విధులు తదితరాలు యువతులను సహజీవనం వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఒంటరి జీవితం, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, సహజీవనం చేసే యువతీయువకులు పెళ్ళి మాటెత్తగానే మొహం చాటేస్తున్నారు. దీన్ని తట్టుకోలేని వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోర్టుల పరిధిలో, తాము సహజీవనం చేసి అన్యాయమై పోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ 15 మంది యువతులు వేసిన కేసులు విచారణ దశలో ఉండటమే ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సహజీవనానికి చట్టబద్ధత లేకపోవడం, ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే జీవనం గడిపినందుకు, అబ్బాయి చేసే మోసమేమీ లేదని కోర్టులు తీర్పిస్తుండటం యువతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది.
ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఈ కేసుల్లో న్యాయం జరగకపోతుండటం, అందుకు తగ్గ చట్టాలు దేశంలో లేకపోవడం కూడా ఆత్మహత్యలు పెరగడానికి కారణంగా మారుతున్నాయి. పైగా, సహజీవనం చేసినందుకు సాక్ష్యాలు కూడా లేకపోవడంతో న్యాయస్థానాలు కూడా మోసపోయిన యువతులు లేదా యువకులకు తగిన న్యాయం చేయలేక పోతున్నాయి.