ఇళ్ల పట్టాల పంపిణీకి స్థానిక ప్రజల అభిప్రాయాలు: పేర్ని నాని

గురువారం, 30 జనవరి 2020 (08:20 IST)
పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి స్థానిక రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్ని నాని అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన డీడీఆర్‌సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పేర్ని నాని పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల మంజూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఆయన అధికారులకు తెలిపారు.

రూ.400 కోట్లతో కొల్లేరు నదిపై మూడు చోట్ల రెగులేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని అప్‌ గ్రేడ్‌ చేస్తామని పేర్ని నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్ల నాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల పెరుగుదలకు కార్యాచరణ రూపొందించి పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

మే నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా ఆసుపత్రిలో 5 పడకలతో కూడిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చెయ్యడంతో పాటు వేంటిలేటర్లలను కూడా సిద్ధం చేస్తామని ఆళ్ల నాని తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు రంగనాధరాజు, తానేటి వనిత, కలెక్టర్ ముత్యాల రాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు