విజయవాడ: నల్ల ధనం దాచుకున్నవారికి, బంగారం సుద్దలుసుద్దలు పేర్చుకున్న వారికి మోదీ మరోసారి షాక్ ఇవ్వనున్నారు. వచ్చేనెల మొదటివారంలో మూడు రోజుల పాటు బ్యాంకు లాకర్లపై దాడులు జరగనున్నాయి. ఇప్పటికే లాకర్ల ఆపరేషన్ పైన నియంత్రణ పాటిస్తున్న అధికారులు, ఖాతాదారులకు నోటీసులిచ్చి వచ్చే నెలలో లాకర్లు తెరుస్తారు.
ఖాతాదారుడు ఉన్నా లేకున్నా... ఒక రెవిన్యూ తహశీల్దారు, పోలీస్ సీఐ సమక్షంలో లాకర్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఖాతాదారుడు తాను లాకర్లో దాచిన డబ్బు, లేదా బంగారానికి లెక్క చూపాలి. కొన్న బంగారానికి రశీదులు ఉండాలి. ఒక్కో లాకర్లో ఒక్కో మహిళకు కేవలం 600 గ్రాముల వరకు అనుమతి ఇస్తున్నారు. ఎక్కువ బంగారం ఉంటే ఐటీ లెక్కలు ఉండాలి. లేకుంటే, బంగారం సీజ్ చేస్తారు.
ఇది మరింత షాక్ అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పెద్ద నోట్లు రద్దయి, చాలామంది అవస్థలు పడుతున్నారు. కానీ, ఇపుడు లాకర్లు కూడా తెరుచుంటే, ఇక నల్లధనం మరింత బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. కొందరు ఖాతాల్లో డబ్బు వేస్తే, లెక్క చెప్పాలని లాకర్లలో కూడా నోట్ల కట్టలు దాచినట్లు తెలుస్తోంది. అలా బయటపడిన డబ్బును ప్రభుత్వం వెంటనే సీజ్ చేసే అవకాశం ఉంది.