రెండేళ్ల జగన్‌రెడ్డి పాలనలో అరాచకాలు, విధ్వంసాలే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామంటే, వైసీపీ మూకలు దాడులకు తెగపడుతున్నాయని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు సర్పంచ్ అనూరాధ చెరువు మరమ్మతుల పనులు ఆరంభానికి ప్రయత్నించగా, వైసీపీ నాయకులు శివ గ్యాంగ్ అడ్డుకున్నారని... సర్పంచ్ భర్త సోమశేఖర్, అతని అనుచరులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అంతుచూస్తామని హెచ్చరించడం వైసీపీ అరాచకాలకు అద్దం పడుతోందన్నారు.
గ్రామంలో భయానక వాతావరణం సృష్టించిన వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం అన్యాయమని తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పడిన ప్రతీ దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడేళ్లలో మూర్ఖపురెడ్డి పాలనకి మూడిపోతుందన్నారు. అందరి ఖాతాలు సెటిల్ చేస్తామని చెప్పారు.
గ్రామంలో మనుషుల్లా, మానవత్వంతో మెలిగితే అదే గౌరవం దక్కుతుందని హితవుపలికారు. అధికారం అండ ఉందనే అహంకారంతో అరాచకాలకు తెగబడితే...రెండింతలు తీసుకునేందుకు సిద్ధంగా వుండండి అంటూ లోకేష్ హెచ్చరించారు.