మచిలీపట్నం సాహితీ మిత్రుల 39వ వార్షికోత్సవ వేడుక

ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:17 IST)
మచిలీపట్నం ఉదయపు నడక మిత్రమండలి భవనంలో కవులు సాహితీ మిత్రుల 39 వ వార్షికోత్సవ వేడుకలు పురప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సభకు సంస్థ అధ్యక్షులు వేమూరి పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. కవులు కళాకారులకు, సాహితీవేత్తలకు బందరు పుట్టిల్లు అని వేమూరి అన్నారు. ప్రముఖ రచయిత్రి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మేరీ కృపాబాయి రచించిన కథా నీరాజనం పుస్తకావిష్కరణ లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాలాజీ  మాట్లాడుతూ గత తరం సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు అందించేది సాహిత్యమే అని అన్నారు. జీవిత సారాంశాన్ని ఏక వాక్యంలో తెలియజేసే వారిని జయకవి అని ఆయన అన్నారు.

ముఖ్య అతిథి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ సాహితీవేత్తలను, కవులను మన సంపద భావించాలని అన్నారు. మచిలీపట్నం సాహితీమిత్రులు సంస్థ గత 39 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.

ప్రముఖ రచయిత్రి డి సి టి సి బండి వెంకట నాగలక్ష్మి పుస్తక సమీక్ష చేస్తూ కథ నీరాజనం లోని కథలు హృదయాన్ని హత్తుకునే విధంగా నేటి సమాజం పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని అన్నారు. 

ఈ కార్యక్రమానికి జొన్నలగడ్డ లక్ష్మి స్వాగతం పలకగా ప్రముఖ రచయిత్రి వారణాసి సూర్య కుమారి వందన సమర్పణ చేశారు. ప్రధాన కార్యదర్శి వడ్డీ ప్రసాద్, షైక్ సిలార్, తెలుగు భాష సంస్కృతి సంఘ ప్రతినిధి పోతురాజు, రాజు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు