చంద్రగిరి నియోజకవర్గంలో 340 ఆర్వో ప్లాంట్ లు

ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:59 IST)
మీలా కష్టపడి వచ్చాను..కార్యకర్తల విలువ నాకు తెలుసునని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుండి ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చంద్రగిరి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తల సహకారం మరువలేనిదని చెప్పుకొచ్చారు. ముక్కోటి ఆలయం సమీపంలోని నారాయణ గార్డెన్స్ లో చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ జెండా మోసి, అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుమ ఉన్న అసమానతలను తొలగించుకోవాలన్నారు. ఐకమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు.  నియోజకవర్గంలో పార్టీకి ఎదురులేని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నం కావాలని కోరారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడేవాడు నిజమైన కార్యకర్త అని చెప్పుకొచ్చారు. కరోనా భయాందోళనలు నుంచి ప్రజలకు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, పార్టీ కార్యకర్తలు దూకుడు ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పల్లె పల్లె కు వెళ్లి ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తం కావాలని సూచించారు.

ప్రతి పల్లెలో చేయాల్సిన అభివృద్ది పనులను చేసి చూపిద్దామన్నారు. పార్టీ కేడర్ ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. అప్పుడే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆత్మీయ పలకరింపుతో కార్యకర్తలు పునరుత్తేజం తో పులకించిపోయారు. ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశంతో పార్టీ కేడర్ లో నూతనోత్సాహం నెలకొంది. మండలాల వారీగా పార్టీ కేడర్ తో ఎమ్మెల్యే చెవిరెడ్డి సమావేశం కొనసాగింది. 
 
మరిన్ని అభివృద్ది పనులు
చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రూ.250 కోట్లు నిధులతో దాదాపు రెండు వేల అభివృద్ది పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి వెల్లడించారు. గ్రంధాలయాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు వంటి అభివృద్ది పనులు చెప్పట్టినట్లు తెలిపారు. ఎనిమిది నెలల పాటు కరోనా తో ఒకరికొకరం నేరుగా సంభాషించుకునే పరిస్థితి లేకపోయిందన్నారు.

ఈ కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గ ప్రజలకు మాస్క్ లు, సానిటైజర్ లు, సి - విటమిన్ టాబ్లెట్ లు, మల్టీ విటమిన్ టాబ్లెట్ లు, కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేసి భరోసా కల్పించామని చెప్పారు. ఓ వైపు అభివృద్ది, మరో వైపు విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలిచామని వెల్లడించారు. 
 
340 ఆర్వో ప్లాంట్ లు..
కరోనా కారణంగా వృధా అయిన కాలం నుంచి బయట పడుతున్న వేళ..నియోజకవర్గ పరిధిలో మరిన్ని అభివృద్ది పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు. ప్రజలు కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురికాకుండా పరిరక్షించేందుకు నియోజకవర్గంలో 340 ఆర్వో ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మరో మూడు నెలల కాలంలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. సాధారణ ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సరికొత్త సాంప్రదాయానికి తెరతీసినట్లు వివరించారు. నియోజకవర్గంలో 34 ఎమ్మెల్యే కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ కేడర్, ప్రజలకు వారధిగా ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు