సీఎం జగన్ ఎక్కడ మాట్లాడినా తాను అబద్ధాలు చెప్పనని చెబుతారని, కానీ, అలా చెప్పడమే జగన్ చెప్పే పెద్ద అబద్ధమన్నారు. మాట్లాడితే పైన దేవుడు ఉన్నాడు అంటారు... నాకు, వైఎస్ షర్మిలకు, వైఎస్ సునీతకు కూడా అదే దేవుడు ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా తాను, తెనాలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పనిచేశామని ఆయన చెప్పారు. ఆ ఐదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుతం అలాంటి పరిస్థితిలేదన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు.
పవణ్ కల్యాణ్ ప్రశ్నించే గుణం ఉందని, అందుకే ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించిందని అన్నారు. కాగా, ఆదివారం, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.