ఏపీ ప్రత్యేక హోదా అంశం.. ఈ నెల 17న చర్చలకు రండి..

శనివారం, 12 ఫిబ్రవరి 2022 (13:30 IST)
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉ‍న్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.
 
త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్‌ఎస్‌ రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉ‍న్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేం‍ద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
 
ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగె​స్‌ పార్టీ చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  
 
ఈ చర్చల ఎజెండాలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం వుంటుంది. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్రం పదేపదే చెబుతున్న నేపథ్యంలో  వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో 17న చర్చలకు ఆహ్వానించడం పెద్ద విజయంగా భావిస్తున్నారు. కేంద్రంలోని హోంశాఖ డిప్యూటీ సెక్రటరీ ఫిబ్రవరి 17న ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను సమావేశానికి పిలిచారు. లేకపోతే కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో వారానికోసారి సమావేశమై పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు