ఒక్క పూట పంట పొలంలో పని చేస్తే దేవుడు కనిపించాడు.. ఎమ్మెల్యే ఆర్కే

ఆదివారం, 25 ఆగస్టు 2019 (13:25 IST)
ఒక్క పూట పంట పొలంలో పని చేస్తే దేవుడు కనిపించాడనీ, మరి, రైతుల కష్టాలను ఏ విధంగా గుర్తించాలని వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ ప్రారంభోత్స వేడుక ఆదివారం జరిగింది. ఇందులో ఆర్కే పాల్గొని మాట్లాడుతూ, వివాదాలు లేకుండా వార్తను వార్తగా రాయగలిగే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని సూచన చేసి, తన నెల వేతనం రూ.లక్షా 75 వేలు సహాయంగా అందించినట్టు తెలిపారు. ప్రజల సమస్యతో వస్తే వారి పక్షాన వార్తలు రాయాలని కోరారు. రాజధానిలో తొలి ప్రెస్ క్లబ్ తాడేపల్లిలో ఏర్పాటు కావటం అభినందనీయమన్నారు. 
 
పెద్దలు ఓ వైపు.. నిరుపేదలు మరోవైపు  ఉన్న ఈ ప్రాంతంలో నిష్పక్షపాత పాత్ర పోషించాలన్నారు. రేపు పరీక్ష అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యేలా ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే, వారం రోజులు ముందు నుంచే ప్రిపేర్ అయ్యేలా ప్రింట్ మీడియా ఉందన్నారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి పేపర్లు నేటికి రాజకీయాలతో సంబంధం లేకుండా కమ్యూనిస్టు పాత్రను సమాజానికి తెలియచేస్తూ నిజాల్ని నిర్భయంగా రాస్తున్నారని చెప్పుకొచ్చారు. మిగిలిన పేపర్లును విమర్శించడం లేదు అవి కూడా నిజాల్ని నిర్భంయంగా రాస్తున్నారని చెప్పారు. 

కమ్యూనిస్టు పత్రికలుగా వారి సేవలు ప్రజలకు అవసరమన్నారు. తానెప్పుడూ ఏ విలేకర్ని ఇబ్బంది పెట్టలేదన్నారు. వారి సంక్షేమానికి తనవంతు చేయూత అందించినట్టు తెలిపారు. తాను పొలం పని చేస్తున్నది నిజమే.. రైతన్న కష్టాన్ని నేటి తరాలకు తెలియజెపాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క పూట చేల్లో పనిచేస్తే దేవుడు కనబడ్డాడనీ, మరి రైతులు కష్టం ఏ విధంగా ఉంటుందో ప్రజలకు వివరించాలన్నారు. మొక్క ఎలా ఉంటుందో నేడు తెలియని దుస్థితిలో మనం ఉండటం శోచనీయమన్నారు. మీడియా వారు మాత్రం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు