మణిపాల్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ: ఇప్పటివరకూ 10వేల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్
గురువారం, 25 మార్చి 2021 (20:35 IST)
విజయవాడ: విజయవంతంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 25వ తేదీ ఆరంభమైన తరువాత తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి దాదాపు 10,000 మంది ప్రజలకు ఇప్పటివరకూ వ్యాక్సిన్ వేసింది. ప్రతి రోజూ దాదాపు 700 మంది ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభించిన తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక కేంద్రంలో అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకోవడం ఇదే.
ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు అపూర్వమైన ఆదరణ లభించింది. ఇక్కడ నమోదైన సంఖ్యలు దానికి ప్రతీకగా నిలుస్తాయి. దాదాపు 150-200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల వాసులు వచ్చి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మా దగ్గర దాదాపు 10 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిలో అధికశాతం సీనియర్ సిటిజన్లు కాగా, స్వల్ప సంఖ్యలో 45 నుంచి 50 సంవత్సరా వయసు కలిగి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నారు.
ఈ వ్యాక్సిన్‌లను తీసుకున్న వారంతా కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ వ్యాక్సిన్ పట్ల మరింత అవగాహన కల్పించడంతో పాటుగా దీని పట్ల ఉన్న అపోహలను పొగొట్టేందుకు అవగాహన కరపత్రాన్ని సైతం ప్రజలకు అందిస్తున్నాం. కోవిడ్ 19 మార్గదర్శకాలన్నీ తు.చ. తప్పకుండా ఆచరించడంలో తోడ్పడిన డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందిని అభినందిస్తున్నాను. ప్రజలు సురక్షితంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి అనువైన వాతావరణం వారు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతి సులభంగా వ్యాక్సిన్ లభించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన గుంటూరు జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ యాస్మీన్ అందించిన సహకారానికి ధన్యవాదములు తెలుపుతున్నాము అని అన్నారు.
వ్యాక్సినేషన్ కోసం మొత్తం అందుకున్న 10 వేల రిజిస్ట్రేషన్‌లలో ఇప్పటికే మధుమేహం, గుండె సమస్యలు కలిగి ఉండటంతో పాటుగా కో-మార్బిడ్ నిబంధన కింద అర్హత కలిగి ఉన్న 1554 మంది 45-59 సంవత్సరాల వయసు కలిగిన రోగులు ఉన్నారు. మరో 6340 మంది రోగులు 60 సంవత్సరాల వయసు మీద పడిన వారు. వీరితో పాటుగా 1000 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 1554 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు సైతం మేము వ్యాక్సిన్‌లను అందించాం.
వ్యాక్సిన్ కోసం ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, ప్రతి దశలోనూ అంటే ఆస్పత్రికి ప్రవేశించిన దగ్గర నుంచి బయటకు వెళ్లేంత వరకూ ఆమె/అతను ఆహ్లాదకరమైన అనుభూతులను పొందేలా ఆస్పత్రి సిబ్బంది సహాయపడటంతో పాటుగా తగిన మార్గనిర్ధేశనమూ చేస్తున్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాలు అయినటువంటి భౌతిక దూరం, మాస్కుధారణ, ప్రతి దశలోనూ శానిటైజర్ స్టేషన్ ఏర్పాటు మొదలైనవి ప్రతి దశలోనూ ఖచ్చితంగా ఆచరించేలా చూస్తున్నారు.
వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌తో పాటుగా స్పాట్ రిజిస్ట్రేషన్‌లను సైతం ఆస్పత్రి తీసుకుంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు కోలుకునేందుకు తగిన రికవరీ ఏరియా సైతం ఇక్కడ ఏర్పాటుచేయడంతో పాటుగా అవసరమైన వారికి వీల్‌చైర్స్ సైతం అందిస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తున్నారు.